పర్యాటక కేంద్రంగా దాలసరి జలపాతం..


Ens Balu
2
దాలసరి
2020-09-15 19:51:48

శ్రీకాకుళం జిల్లాలో మంచి పర్యాటక ప్రదేశంగా దాలసరి జలపాతంను తీర్చిదిద్దుతామని రాష్ట్ర పశుసంవర్ధక,  మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. మందస మండలం చీపి పంచాయతీ  దాలసరి గ్రామం వద్ద కొత్తగా కనుగొన్నజలపాతాన్ని మంత్రి మంగళ వారం సందర్శించారు. శ్రీకాకుళం జిల్లా ప్రకృతి శోయగాలకు నిలయమని మంత్రి అన్నారు. పలాస నియోజకవర్గంలో పర్యాటక ప్రదేశాలకు కొదవ లేదని ఇందులో భాగంగా మరింత సుందరంగా తీర్చిదిద్దుటకు కృషి చేస్తామని ఆయన అన్నారు. దాలసరి జలపాతం రాబోయే రోజుల్లో ఒక మంచి పర్యాటక స్ధలంగా ఫరిడవిల్లగలదని ఆయన పేర్కొన్నారు. పర్యాటక ప్రదేశాలపై వారం రోజుల్లో కార్యాచరణ తయారు చేయుటకు చర్యలు చేపడతామని అన్నారు. అవసరమైతే ఒరిస్సా ప్రభుత్వంతోను, ఐ.టి.డి.ఎ అధికారులతోను మాట్లాడి దాలసరి జలపాతం అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. పలాస నియోజకవర్గంలో ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన జలపాతాలను మరింత అభివృద్ధి చేసి పర్యాటకులకు గొప్ప ఆహ్లాదకరమైన పిక్నిక్ స్పాట్ గా తయారు చేయుటకు ప్రయత్నిస్తామని అన్నారు.  ఈసందర్భంగా దాలసరి గ్రామస్తులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికి పూలమాలలతో సత్కరించారు.