విశాఖ శివారులోని వేపగుంట సింహపురి కాలనీలో వేంచేసియున్న శ్రీ సీతా రామాలయం 19వ వార్షికోత్సవాలు మంగళధ్వని వేద మంత్రోచ్ఛారణల మధ్య సాంప్రదాయ రీతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మట్టపల్లి హనుమంతరావు ప్రసంగిస్తూ ఈ సృష్టిలో ఆధ్యాత్మిక సిరికి ఆగమ సంపదకి చిహ్నంగా దేవాలయాలు నిలిచాయని పేర్కొన్నారు. ఆలయ గౌరవ అధ్యక్షులు ఎం వి రాజశేఖర్ మాట్లాడుతూ, ఆలయాలలో ఆగమ సంప్రదాయంలో నిర్వహించే ఉత్సవాలవల్ల లోకకళ్యాణం కలుగుతుందన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న కమిటీ సభ్యులను అర్చకులను సహకరిస్తున్న దాతలను భక్తులను ప్రశంసించారు. అంతకు ముందు శ్రీ సీతా రామాలయ వార్షికోత్సవాలను ప్రముఖ పారిశ్రామికవేత్త మట్టపల్లి హనుమంతరావు ఆలయ చైర్మన్ పి రామ్మోహన్రావు, గౌరవ అధ్యక్షులు ఎం వి రాజశేఖర్, స్థానిక కార్పొరేటర్ పి నర సింహం జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు సివిఆర్ మూర్తి ఉపాధ్యక్షులు టీ చిరంజీవి కార్యదర్శి ఏవి చలపతిరావు కోశాధికారి వి సురేష్ తదితరులు పాల్గొన్నారు.