తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దేవీపట్నం మండలం, ఇందుకూరు-1 పునరావాస కాలనీని సందర్శించనున్న నేపథ్యంలో పర్యటనకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎం.రవీంద్రనాథ్‌బాబు.. జేసీ (ఆర్) సుమిత్ కుమార్; ఇన్‌ఛార్జ్ జేసీ (ఏ అండ్ డబ్ల్యూ), జేసీ (హెచ్) ఎ.భార్గవ్‌తేజతో కలిసి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇందుకూరులో జరపనున్న పర్యటన కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ ప్రాథమిక వివరాల ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 4వ తేదీన ఉదయం 10 గం. నుంచి 11 గం. వరకు ఇందుకూరు-1 ఆర్అండ్ఆర్ కాలనీని సందర్శించి, నిర్వాసితులతో మాట్లాడతారని తెలిపారు. హెలిప్యాడ్, కాలనీ తదితర ప్రాంతాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లకు జాయింట్ కలెక్టర్లు, ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్లు, ఆర్‌డీవోలు, వివిధ శాఖల అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు వెల్లడించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు; ముఖ్యమంత్రి కార్యాలయం, జలశక్తి శాఖ మంత్రిత్వ శాఖ సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. వాహనాలు, బారికేడింగ్, పారిశుద్ధ్యం, మెడికల్ క్యాంప్ ఏర్పాటు, విద్యుత్ సరఫరా, మీడియా సమన్వయం తదితర అంశాలపై ఆయా శాఖల ఆధికారులకు కలెక్టర్ సూచనలు ఇచ్చారు.
జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎం.రవీంద్రనాథ్‌బాబు మాట్లాడుతూ పటిష్ట భద్రతకు సంబంధించిన అంశాలతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తుపై అధికారులకు సూచనలిచ్చారు. అన్ని శాఖల సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, అడిషనల్ ఎస్‌పీ కరణం కుమార్, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీపీవో ఎస్‌వీ నాగేశ్వర్‌నాయక్ తదితరులు హాజరయ్యారు.