శాఖాపరమైన పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..


Ens Balu
5
Srikakulam
2022-03-03 10:21:58

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్న శాఖాపరమైన పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని జిల్లా రెవెన్యూ అధికారి దయానిధి పేర్కొన్నారు. గురువారం జిల్లా రెవెన్యూ అధికారి తన చాంబర్లో 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న శాఖాపరమైన పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. పరీక్షల నిర్వహణకు అంతరాయం కలగకుండా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే పరీక్షలు జరుగుతున్న కళాశాలలో జనరేటర్ అందుబాటులో ఉండాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు. పరీక్షల నిర్వహణ తేదీలలో రవాణా నిమిత్తం బస్సు సౌకర్యం కల్పిస్తూ బస్సుకు శాఖాపరమైన పరీక్షలు స్పెషల్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.  పరీక్షలు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరలా మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్నట్లు తెలిపారు. ఉదయం పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గం. 9:15, మధ్యాహ్నం పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గం.2.15 నిమిషాలలోపు హాజరు కావాలని తరువాత అనుమతించబోమని వెల్లడించారు. జిల్లాల్లో 3052 మంది ఆన్లైన్, 648 పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. 5, 6 తేదీలలో టెక్కలి ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో, 4వ తేదీ నుండి 9వ తేదివరకు ఎచ్చేర్ల శివాని, వెంకటేశ్వర  కళాశాలల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు.

7,8 తేదీలలో నిర్వహించే పరీక్షలకు ఎటువంటి పుస్తకాలు తీసుకురాకూడదని, 4,5,6,9 తేదీలలో నిర్వహించే పరీక్షలకు బుక్స్ తెచ్చుకోవచ్చని గైడ్స్, జిరాక్సు, ప్రింటెడ్ మెటీరియల్స్ ,వాచీలు, మొబైల్స్,ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు.

7 8 తేదీలలో నిర్వహించే గ్రామ సర్వేయర్ 161,162,163,164 పేపర్లకు సంబంధించిన పరీక్షలకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనుమతించబడునని తెలియజేశారు. పరీక్షలలో ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు పై ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలు విజయవంతంగా జరిగేలా చూడాలన్నారు. ఈ పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ ఎం. వెంకట్రావు, రవాణా, విద్యుత్ ఇతర శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.