రాష్ట్రంలో ప్రతి ఇంటికీ జల్ జీవన్ మిషన్ ద్వారా మంచి నీటిని అందించడం జరుగుతుందని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు పొందూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురు వారం స్పీకర్ శంకుస్థాపనలు చేసారు. సింగూరు గ్రామంలో సుమారు రూ.40 లక్షల నిధులతో సిసి రోడ్డుకు, బొడ్డేపల్లి గ్రామంలో జల జీవన్ మిషన్ ద్వారా రూ.17.10 లక్షల నిధులతో ఇంటింటికి మంచి నీటి కొళాయి, మొదలవలస గ్రామంలో రూ.46 లక్షలతో ఇంటింటికి మంచినీటి కుళాయిలు కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. అనంతరం మొదలవలస, బొడ్డేపల్లి గ్రామాలకు సంబంధించిన సమస్యలపై,సంక్షేమ పథకాల పై ప్రజల సమక్షంలో సచివాలయ సిబ్బంది, ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో మహిళలు ప్రధానంగా ఆయన దృష్టికి తీసుకు వచ్చిన సమస్య మంచినీటి సమస్య అని ఆ సమస్యలను ప్రధానంగా తీసుకొని పూర్తి చేయబోతున్నామని అన్నారు.
ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన ఇచ్చిన హామీలను దశలవారీగా పూర్తి చేస్తున్నారని ఆయన వివరించారు. ఆమదాలవలస నియోజకవర్గంలో రూ. 234 కోట్లతో ఇంటింటికి మంచినీటి కొళాయి పథకాన్ని పూర్తి చేస్తున్నామని అన్నారు. పొందూరు మండలానికి సంబంధించి గండ్రేడు నుండి రాపాక కొండపై ట్యాంకు నిర్మించి మంచినీటి పంపింగ్ చేసి పొందూరు మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు ఇంటింటికి మంచినీరు అందిస్తామని ఆయన అన్నారు. బొడ్డేపల్లి గ్రామంలో ప్రజలు సాగునీరు కోసం రెల్లిగెడ్డ పనులు పూర్తి చేయాలని విన్నవించగ వచ్చే ఖరీఫ్ కల్లా పనులు పూర్తిచేసి అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి లొలుగు కాంతారావు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు బడాన సునీల్, వైస్ ఎంపీపీ వండాన వెంకట్రావు, తమ్మినేని చిరంజీవి నాగ్, కిల్లి నాగేశ్వరరావు, కొంచాడ రమణమూర్తి, గాడు నాగరాజు, సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.