శ్రీకాకుళం జిల్లాలో గ్రంథాలయాలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పర్సన్ సువ్వారి సువర్ణ తెలిపారు. గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థలో గ్రంథాలయ బడ్జెట్ పై జరిగిన సమావేశంలో చైర్పర్సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రంధాలయాల వలన ప్రజలకు ముఖ్యంగా యువతకు మంచి ప్రయోజనం కలగాలని అన్నారు. గ్రంథాలయాలు యువతకు వారి భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా రూపొందించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేస్తూ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో బుక్ డిపో కేంద్రాలను కూడా ఆసక్తి ఉన్న గ్రామాల్లో ఏర్పాటు చేయుటకు నిర్ణయించామని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఐదు ప్రతిపాదనలు అందాయని ఆ గ్రామాల్లో బుక్ డిపో కేంద్రాలను ఏర్పాటు చేయుటకు అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. బుక్ డిపో నిర్వాహకులకు మూడు వేల రూపాయలు గౌరవ పారితోషకం ఇచ్చుటకు నిర్ణయించామని ఆమె పేర్కొన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా పుస్తకాల ఎంపిక కార్యక్రమం జరగడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు లేటెస్ట్ పుస్తకాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్రంధాలయాలకు చెల్లించాల్సిన సెస్ ను సంబంధిత అధికారులు వెంటనే చెల్లించాలని ఆమె కోరారు. తద్వారా గ్రంథాలయాల అభివృద్ధికి బాటలు పడతాయని, విజ్ఞాన భాండాగారాలుగా వెలసిల్ల గలవని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కే. కుమార్ కుమార్ రాజా, సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు లోచర్ల రమేష్, వయోజన విద్య ఉప సంచాలకులు సోమేశ్వరరావు., సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.