ఖాకీలంటే కాఠిన్యమేకాదు..అంతకు మించిన కారుణ్యం కూడా ఉంటుందని.. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆధ్వర్యంలో ఓ రెండు ప్రాణాలు నిలబెట్టే విషయంలో జిల్లా పోలీసులు నిజం చేసిచూపి తమ మానవత్వాన్ని ప్రదర్శించారు. సేవలందించడంలో ఎల్లప్పుడూ ముందుండే జిల్లా ఎస్పీ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి యొక్క అవయవాలను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి విశాఖపట్నం మరియు చెన్నై తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీన్ ఛానల్ ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి యొక్క కిడ్ని విశాఖలోని ఆరిలోవ అపోలో ఆసుపత్రికి చేరింది. లివర్ విశాఖపట్నం నుంచి చైన్నె విమానంలో చేరుకుంది. కాకినాడలోని ట్రస్టు ఆసుపత్రి నుంచి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి యొక్క అవయవాలను అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ సౌజన్యంతో ట్రస్టు ఆసుపత్రి డాక్టర్ రామక్రిష్ణ కోఆర్డినేట్ చేస్తూ ఒక ప్రత్యేక అంబులెన్సు ద్వారా తరలించడంలో జిల్లా పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ సిఐ రామచంద్రరావు, పెద్దాపురం క్రైమ్ సిఐ సురేష్ అంబులెన్స్ గ్రీన్ ఛానల్ ను పూర్తిస్థాయిలో పర్యవేక్షించారు. కాకినాడ నుంచి అంబులెన్స్ కాన్వయ్ స్టేషన్ నుంచి స్టేషన్ మారే సమయంలో అంబులెన్సుకి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన తీరు నభూతో నభవిష్యతి అన్న చందంగా నిర్వహించారు పోలీసులు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు దానం చేసే క్రమంలో వాటిని సురక్షితంగా విశాఖలోని ఆసుపత్రికి చేర్చడానికి తూర్పుగోదావరి జిల్లా పోలీసులు చేసిన క్రుషి, సేవల పట్ల జిల్లా వాసులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఎంతో ఓర్పుతో పోలీస్ పైలట్ ఏర్పాటు చేసి మరీ అంబులెన్సుకి ఎక్కడా ఆటంకం లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరుతో ఇద్దరు వ్యక్తులకు అవయవాలను మార్పిడి చేసి ప్రాణాలు నిలబెట్టడానికి వీలుపడింది. ఈ సేవ తూర్పుగోదావరి జిల్లా పోలీసుశాఖలో ఒక మంచి కార్యక్రమంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు..ప్రార్ధించే పెదవుల కన్నా..సాయం చేసే చేతులున్న మిన్న అని మరోసారి రుజువుచేసి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు సెల్యూట్ చేయాల్సిందే..