లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు..


Ens Balu
6
Visakhapatnam
2022-03-09 11:03:53

గర్భస్థ పిండ లింగ నిర్ధారిత పరీక్షలు చేసి పుట్టబోయే శిశువు ఆడో, మగో తెలియజేయడం నేరమని   జాయింట్ కలెక్టరు పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. బుధవారం విశాఖలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన గర్భస్థ పిండ లింగ నిర్థారిత పరీక్షల నియంత్రణ చట్టంపై శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్కానింగు సెంటర్లో ఉన్న స్కానింగు పరికరం  కేవలం ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం కోసమేనని,  లింగ నిర్థారణ కోసం కాదని స్పష్టం చేశారు. లింగ నిర్ధారణ తెలిపే వారిపై కఠిన శిక్షలు అమలవుతాయన్నారు. అర్హత కలిగిన వైద్యుని  ప్రిస్ క్రిప్షన్ వుంటేనే స్కానింగు చేయాలన్నారు.  పేదలకు 5 శాతం స్కానింగ్  ఉచితంగా చేయాలని, ప్రతీ నెలా రిపోర్టు ఇవ్వాలని స్కానింగ్ కేంద్రాల వారిని ఆదేశించారు.  చట్టాన్ని అతిక్రమించినట్లయితే కఠిన చర్యలు వుంటాయని హెచ్చరించారు.  సమాజంలో స్త్రీ పురుషులు ఇరువురు సమానమే అని ఈ విషయంపై సమాజంలో మార్పు రావాలన్నారు. జిల్లా స్కానింగు కేంద్రాలలో చట్టం పూర్తిగా అమలవుతున్న్లట్లు  తెలిపారు.
జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటి జడ్జి  కె.వి.వి. బుల్లి కృష్ణ మాట్లాడుతూ చట్టం యొక్క ప్రాధాన్యత, ఎటువంటి పరిస్థితుల్లో గర్భిణులకు స్కానింగు నిర్వహించాలనే విషయంపైన గర్భ నిర్ధారణకు స్కానింగ్ చేసినట్లయితే చట్ట ప్రకారం విధించే జరిమానాలు, శిక్షలు గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.విజయలక్మి మాట్లాడుతూ స్త్రీ పురుష సమానత్వం, జిల్లాలో చట్టం ఉపయోగం గూర్చి చెప్పారు.  ఈ కార్యక్రమంలో  ఎడిషనల్ డి.ఎం.హెచ్.ఒ, డా.వసుంధర, ఎ.సి.పి. ప్రేమ్ కాజల్, డా.రమణి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అడ్వైజరీ కమిటీ సభ్యులు,  వైద్యాధికారులు, స్కానింగు కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.