విశాఖజిల్లాలో పారిశద్ధ్య నిర్వహణకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, జగనన్న స్వచ్ఛ సంకల్పం లక్ష్యాలను చేరుకుంటామని కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున పేర్కొన్నారు. వైఎస్సార్ జలకళ, జలజీవన్ మిషన్ పథకాలను సక్రమంగా అమలు చేసి ఫలితాలను అందరికీ చేరవేస్తామని తెలిపారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేదీ, డిప్యూటీ కమిషనర్ కోన శశిధర్ జిల్లా కలెక్టర్లతో గురువారం వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ, చెత్త సేకరణ కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై ఆశాజనక ఫలితాలు రావాలని, ఆ దిశగా కలెక్టర్లు, సంబంధిత విభాగాల అధికారుల ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలు తలెత్తకుండా, తప్పుడు నివేదికలు పంపించి పని నుంచి తప్పించుకోకుండా క్షేత్రస్థాయి సిబ్బందిపై పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఇంటి పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. చాలా జిల్లాల్లో షెడ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని, పనులను వేగవంతం చేయాలన్నారు. విద్యుత్ కనెక్షన్లు, అప్రోచ్ రోడ్లు, నీటి సౌకర్యం తదితర మౌలిక వసతులను కల్పించాలని సూచించారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలలో మరుగుదొడ్లు నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని త్వరితగతిన పనులు పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా సాధ్యమైనంత ఎక్కువ మందికి పనులు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే డిమాండ్ మేరకు పనులు కల్పిస్తామని చెప్పారు. మెటీరియల్ కాంపోనెంట్ నిధులను వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శానిటరీ కాంప్లెక్సుల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటి వరకు జిల్లాలో 12 ఎకరాల భూమిని గుర్తించామని చెప్పారు. రైతులకు బోర్‌వెల్స్ ఏర్పాటు చేస్తామని సాగునీటి అవసరాలు తీరుస్తామని చెప్పారు. చెత్తసేకరణ కేంద్రాల నిర్వహణలో లోపాలు లేకుండా, ఇంటింటి చెత్త సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పన్నుల వసూలులో కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయటం ద్వారా మరిన్ని ఫలితాలు సాధిస్తామని చెప్పారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్లు ఎం. వేణుగోపాల్ రెడ్డి, కల్పనా కుమారి, ఆర్.డబ్ల్యూ.ఎస్., డ్వామా, ఫారెస్టు విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.