మందగమనం వీడి పనుల్లో పురోగతి సాధించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోక తప్పదని జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున గృహ నిర్మాణ శాఖ అధికారులను హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చేపట్టిన పేదలందరికీ ఇళ్లు పథకం ఫలాలు అందరికీ చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మంచి పనితీరు కనబరిచి ఆశాజనక ఫలితాలు సాధించాలని సూచించారు. జిల్లాలో జరుగుతున్న గృహ నిర్మాణ పనులు, ఓటీఎస్ ప్రక్రియ, బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై మంగళవారం ఆయన గృహ నిర్మాణ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గృహ నిర్మాణాలకు సంబంధించిన అన్ని పనుల్లో మరింత పురోగతి సాధించాలని, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. కొన్ని మండలాల్లో ఇంకా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాకపోవటం శోచనీయమని కలెక్టర్ అన్నారు. త్వరితగతిన స్పందించి పనులు ప్రారంభించాలని చెప్పారు. గృహ నిర్మాణ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు సమన్వయంగా వ్యవహరిస్తూ ఓటీఎస్ ప్రక్రియను సజావుగా చేయాలని, నగదు చెల్లించిన వారికి త్వరితగతిన పట్టాలు అందజేయాలని సూచించారు. ఓటీఎస్ ప్రయోజనాలను లబ్ధిదారులకు తెలియజేయాలని అధికారులకు చెప్పారు. అలాగే ఓటీఎస్ పట్టా ఆధారంగా ఏపీజీవీబీ బ్యాంకు రూ.3 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. మిగిలిన బ్యాంకులు కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, పనుల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. పనిలో వెనుకబాటు తనానికి సాకులు చెప్పొద్దని అధికారులకు సూచించారు. క్షేత్ర స్థాయిలో పని చేసే ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఇళ్ల నిర్మాణాల ప్రక్రియలో వేగం పెంచేందుకు ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలని చెప్పారు.
భూమి పూజ చేస్తే రూ.10 వేలు జమ
జగనన్న లేఅవుట్లలో భూమి పూజ చేసిన వెంటనే సంబంధిత లబ్ధిదారులకు రూ.10 వేలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిపై లబ్ధిదారుల్లో అవగాహన కల్పించి నిర్మాణాల్లో వేగం పెంచాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పేర్కొన్నారు. బీబీఎల్ స్థాయిలో కేవలం భూమి పూజ చేసిన వారికి ప్రోత్సాహక రూపంలో నగదు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీని ద్వారా నిర్మాణాల్లో వేగం పెంచాలని సూచించారు. లేఅవుట్లలో నీరు, ముడిసరుకులు, ఇతర వసతులు కల్పించాలని చెప్పారు. ఈ నెల 18వ తేదీలోగా బీబీఎల్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, గృహ నిర్మాణ శాఖ ఈఈ, డీఈలు, ఏఈలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.