జగనన్న శాశ్వత భూహక్కు, మరియు భూరక్ష (రీ సర్వే) పథకాన్ని జిల్లాలో పకడ్బంధీగా అమలు చేయనున్నామని, ఈ మేరకు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున చెప్పారు. ప్రణాళికాబద్దంగా సమగ్ర రీసర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో, విజయవాడ నుంచి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి. సాయిప్రసాద్, సర్వే సెటిల్‌మెంట్స్ కమిషనర్ సిద్దార్థ జైన్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, డి.ఆర్.వో. శ్రీనివాసమూర్తి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే ప్రక్రియకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను వివరించారు. సర్వే ప్రక్రియను మరింత వేగంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రక్రియను సజావుగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఇచ్చిన లక్ష్యాల మేరకు ఇప్పటి వరకు గుర్తించిన పది మండలాల్లో 26 గ్రామాల్లో సర్వే పూర్తి చేశామని తెలిపారు.
అంతకుముందు సిసిఎల్ఏ సాయిప్రసాద్ మాట్లాడుతూ భూముల మ్యుటేషన్ కోసం ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. తహశీల్దార్లు వాటిని ఎందుకు తిరస్కరిస్తున్నారో, తిరస్కరణకు సరైన కారణాలు ఉన్నాయో లేవోనని, క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ముటేషన్ ప్రక్రియకు సంబంధించి అకారణంగా ధరఖాస్తుల తిరస్కరణ ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో రిజెక్షన్ పవర్స్ ఆర్డీవో కి బదిలీ చేయనున్నట్లు సిసిఎల్ ఏ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, సర్వే విభాగం సహాయ సంచాలకులు తదితరులు పాల్గొన్నారు.