విజయనగరం జిల్లాలో వరి,చెరకు తదితర సంప్రదాయ పంటల బదులు, రైతులను లాభసాటిగా ఉండే ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కోరారు. రైతులతో మమేకమై, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వ్యవసాయశాఖాధికారులకు కలెక్టర్ పిలుపునిచ్చారు. పంటల మళ్లింపు విధానంపై స్థానిక కృషిభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన వర్క్‌షాపును కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేల స్వభావం, రైతుల స్థితిగతుల ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలను సూచించాలని అన్నారు. ముఖ్యంగా ఆయా పంటలకు ఉన్న మార్కెట్ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే పంటలను ఎంపిక చేయాలని సూచించారు. ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ, అది రైతులవరకు చేరడం లేదని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి, రైతులతో మమేకమై, వారి వాస్తవ అవసరాలను గుర్తించాలని సూచించారు. పంటల మళ్లింపుపై రైతులవారీగా, గ్రామం వారీగా ప్రణాళికను రూపొందించి, అమలు చేయాలని సూచించారు. మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి, ఉద్యాన, వాణిజ్యపంటలను సూచించాలన్నారు. ముందు అధికారుల దృక్ఫథంలో మార్పు రావాలని సూచించారు. ఈ-క్రాప్ నమోదు రైతుకు కీలకమని, దీనిపై ప్రతీఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా పంట పండించే ప్రతీ రైతుకు మేలు చేయడం మన లక్ష్యం కావాలని చెప్పారు. రైతులకు పంట రుణాలు విరివిగా ఇప్పించేందుకు కృషి చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయాన్నిపెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కోరారు. ప్రతీ గ్రామంలో కూడా ఎంతోకొంత ప్రకృతి సేద్యం చేయించాలని, తద్వారా వారిని చూసి, ఇతర రైతులు కూడా స్ఫూర్తి పొందే అవకాశం ఉందని అన్నారు. విధి నిర్వహణలో మనసుపెట్టి పనిచేయడం ద్వారా, మంచి ఫలితాలను సాధించవచ్చని స్పష్టం చేశారు. వచ్చే ఖరీఫ్ నాటికి రైతుల దృక్ఫథంలో మార్పును తీసుకువచ్చి, ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లే విధంగా ప్రతీ వ్యవసాయ అధికారి కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జెడి తారకరామారావు, డిడి బిఎస్ఆర్ నందు, ఎడిఏలు, ఏఓలు, వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.