సచివాలయ పరీక్షలో కోవిడ్ నిబంధనలు పాటించాలి..
Ens Balu
3
Visakhapatnam
2020-09-16 19:24:05
గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలలో కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్థి మరియు పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేది వరకు నిర్వహించనున్న గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలపై విజయవాడ నుండి బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్.పి.లు, మున్సిపల్ కమీషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిర్వహించిన గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లుగానే ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ఇప్పటికే ప్రశ్నా పత్రాలు జిల్లా కేంద్రాలకు చేరాయన్నారు. సరిపడిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖాధికారులు పరీక్షా కేంద్రాల వద్ద తగు ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు రవాణాకు అంతరాయం లేకుండా రవాణా శాఖ, ఎపిఎస్.ఆర్టి.సి తగు చర్యలు తీసుకుంటారని, విద్యుత్, గ్రామీణ ప్రాంతంలో డిపిఓ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమీషనర్లు పరీక్ష కేంద్రాల వద్ద శానిటేషన్, తాగునీరు చూడాలని ఆయన సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ ఉంటే వారికి పరీక్ష కేంద్రం వద్ద ఐసోలేషన్ రూం ఏర్పాటు చేయాలని, ఇన్విజిలేటర్ కు పిపిఇ కిట్ ఇవ్వాలన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద మాస్క్ లు, పిపిఇ కిట్లు ఉండాలని పేర్కొన్నారు. ఎక్కడా పొరపాటు జరగకుండా పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలన్నారు.
రాష్ట్ర పట్టణాభివృద్థి మరియు పరిపాలన శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలలో మంచి పేరు వచ్చిందని, కోవిడ్ -19 ఉన్న దృష్ట్యా కోవిడ్ నిబంధనలు పాటించి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేయాలన్నారు. మున్సిపల్ పరిధిలోని అన్ని పరీక్ష కేంద్రాలను శానిటైజేషన్ చేయాలని సూచించారు. అభ్యర్థులకు రవాణాకు ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్ మాట్లాడుతూ కోవిడ్-19 పాజిటివ్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే అలాంటి వారికి ఒక ఐసోలేషన్ రూం ఏర్పాటు చేసి అందులో పరీక్ష పెట్టాలన్నారు. ప్రతీ పరీక్షకేంద్రం వద్ద ఒక ఐసోలేషన్ రూం ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ అభ్యర్థులకు మందులు కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సరఫరా చేస్తారని తెలిపారు. పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ క్లియరెన్స్ ఉండాలని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరం అయితే ఐసిడిఎస్ సిబ్బందిని వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ముందుగానే చేరుకోవాలని, అక్కడ ధర్మల్ స్కాన్ ఉంటుందని, అక్కడ ఆలస్యం జరుగుతుందని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద శానిటైజర్లు, మాస్క్ లు ఉండాలన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది సర్వీసులు వినియోగించుకోవాలని ఆయన చెప్పారు.
జిల్లా జాయింట్ కలెక్టర్-1 వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు చెప్పారు. ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. జివియంసి కమీషనర్ జి. సృజన మాట్లాడుతూ ఈ మధ్యన ఒక పరీక్షకు అభ్యర్థులకు మాత్రమే ఆర్.టి.సి. బస్సులను నడిపినట్లు చెప్పారు. ఆలాగే గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలకు ఆర్.టి.సి. బస్సులను అభ్యర్థులకు కోసం మాత్రమే నడిపేందుకు తగు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి. కృష్ణారావు, జిల్లా పరిషత్ సిఇఓ నాగార్జున సాగర్, డిపిఒ కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.