సెప్టెంబరు 17 నుంచి 25 వరకూ ఎంసెట్...
Ens Balu
3
Srikakulam
2020-09-16 20:07:22
శ్రీకాకుళం జిల్లాలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ జె.నివాస్ బుధ వారం మీడియాకి వివరించారు. సెప్టెంబరు 17,18 తేదీలతో సహా 21 నుండి 25 వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. రాజాం జి.ఎం.ఆర్ ఇంజనీరింగు కళాశాల, టెక్కలి ఆదిత్య ఇంజనీరింగు కళాశాల, ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగు కళాశాల, శ్రీ శివాని ఇంజనీరింగు కళాశాలల్లో పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు జరుగుతాయని ఆయన వివరించారు. రాజాం జి.ఎం.ఆర్ ఇంజనీరింగు కళాశాలలో 2,725 మంది, టెక్కలి ఆదిత్య ఇంజనీరింగు కళాశాలలో 3,473 మంది, ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగు కళాశాలలో 2,213 మంది, శ్రీ శివాని ఇంజనీరింగు కళాశాలలో 2,042 మంది 25వ తేదీ వరకు జరిగే పరీక్షలకు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేసామని చెప్పారు. పూర్తి స్ధాయి బందోబస్తు ఉందని, 144వ సెక్షన్ పరీక్షా కేంద్రాల వద్ద ఉందని ఆయన పేర్కొన్నారు. సంబంధిత తహశీల్దార్లకు సైతం ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు. విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు కనీసం గంట ముందుగా హాజరు కావాలని, ఒక్క నిమిషం ఆలస్యం జరిగినా కూడా అనుమతించేది లేదని గమనించాలని ఆయన సూచించారు. కోవిడ్ వ్యాప్తి ఉన్నందున తగిన ఏర్పాట్లు, సురక్షిత చర్యలతో పరీక్షలకు హాజరు కావాలని ఆయన కోరారు.