మేడేని ఘనంగా చేయాలి..సిఐటియు


Ens Balu
9
Kakinada
2022-04-19 12:37:45

కార్మిక పోరాటాలకు దిక్సూచి గా నిలిచిన ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సిఐటియు పిలుపు ఇచ్చింది. సోమవారం సాయంత్రం స్థానిక సిఐటియు కార్యాలయమైన కా. పి‌. లక్ష్మీదాస్ భవన్ లో సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాబ్జీ మాట్లాడుతూ 1886 లో అమరికా చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తిగా  ప్రారంభమైన మేడే భారతదేశంలో 1923 లో సింగారవేలు చెట్టియార్ నాయకత్వం లో మద్రాసు లో తొలిసారిగా జరిగిందన్నారు. కాకినాడ నగరంలో బండ్ల కార్మికులు 1938 లో మేడే నిర్వహించారని పేర్కొన్నారు. కార్మికులు సంఘం పెట్టుకోవడానికి, సంఘటితం కావడానికి, హక్కులు సాధించుకోవడానికి మేడే దిక్సూచి గా నిలుస్తుందని, కాకినాడ నగర పరిసర ప్రాంతాల్లో కార్మికులంతా 2022 మేడే ను ఘనంగా నిర్వహించాలని సిఐటియు పిలుపు ఇస్తోందన్నారు. సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి. బేబి రాణి, జిల్లా ఉపాధ్యక్షులు కె. సత్తిరాజు లు మాట్లాడుతూ కేంద్ర మోడీ ప్రభుత్వం భారత కార్మిక వర్గం స్వాతంత్ర్య పోరాట కాలం నుండి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. మార్చి 28, 29 తేదీల్లో జరిగిన సమ్మె లో సుమారు 20 కోట్ల మంది కార్మికులు పాల్గొని కేంద్ర పాలకులను హెచ్చరించారని పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కార్మిక పోరాటాలు ముందుకే సాగుతాయన్నారు. సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ మేడే రోజు సిఐటియు అనుబంధ సంఘాల వారు ఉదయం 9 గంటల లోపు అరుణ పతాకావిష్కరణ చేసుకుని 10 గం కు సిఐటియు జిల్లా కార్యాలయమైన కా. పి‌ . లక్ష్మీదాస్ భవన్ వద్ద అరుణ పతాకావిష్కరణ లో పాల్గొనాలని, తదుపరి ప్రదర్శన జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకట రమణ లతో పాటు భారతి, వేణు, నాగలక్ష్మి, అమ్ములు, విజయ్ కుమార్, సత్తిబాబు, ప్రకాశరావు, సతీష్, గంగాధర్ , గురుమూర్తి, రవి తదితరులు పాల్గొన్నారు.