ప్రభుత్వ భవన నిర్మాణాలు పూర్తిచేయాలి..


Ens Balu
5
Kakinada
2022-04-19 13:14:47

గ్రామ/వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ భవనాలకు కావలసిన భూ సేకరణను వేగవంతం చేసి నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్... 22(A)లోని అంశాలు, స్పందన అర్జీల పరిష్కారం, వాటర్ టాక్స్, ఓటిఎస్, భూరికార్డుల స్వచ్ఛీ కరణ, ఎండీయు వాహనాల ఖాళీల భర్తీ, వాహనాల ద్వారా బియ్యం సరఫరా, ప్రభుత్వ శాశ్వత భవనాలకు అవసరమైన భూసేకరణ తదితర అంశాల పురోగతిపై డివిజన్, మండల స్థాయి రెవిన్యూ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల స్వచ్చీకరణ (పీఓఎల్ఆర్) ప్రక్రియను వివాదాలకు తావు లేకుండా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టి నిర్దేశించిన గడువులోపు లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్, స్కానింగ్ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు డాక్యుమెంట్స్ అందజేసే విధంగా చూడాలన్నారు. స్పందన ద్వారా గ్రామ/వార్డు సచివాలయాలకు వచ్చిన అర్జీలను తప్పనిసరిగా గడువులోపు పూర్తి చేయాలని ఆమె తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వ శాశ్వత భవనాలు అయిన గ్రామ/వార్డు సచివాలయం, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ భవనాలకు సంబంధించి జిల్లాలో ఇంకా భూసేకరణ పూర్తికాని  చోట అనువైన స్థలాలు త్వరిత గతిన గుర్తించి, భవన నిర్మాణాలు ప్రారంభించాలని జేసీ అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్వో కె.శ్రీధర్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఇతర రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.