పనిచేయని అధికారులపై వేటు తప్పదు


Ens Balu
3
Srikakulam
2022-04-19 14:00:12

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న గృహ నిర్మాణాలలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని, పనిచేస్తున్న అధికారులకు ప్రోత్సహించడంతో పాటు పనిచేయని అధికారులపై వేటు తప్పదని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ హెచ్చరించారు. జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాలపై  మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్మిస్తున్న గృహ నిర్మాణాలకు సంబంధించి నిధులు, సిమెంటు, ఇసుక తదితర సమస్యలు లేవని, అయినప్పటికీ నిర్మాణాలు సకాలంలో జరగడం లేదన్నారు. ఇందుకు ఇంజినీరింగ్ అధికారుల అలసత్వమే కారణమని, ఇకపై ఉపేక్షించేది లేదని పనిచేయని అధికారులపై వేటు తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. ఇంజినీరింగ్ అధికారులకు అప్పగించిన పనులను రోజు వారీ సమీక్షించుకుంటూ చేపట్టవలసిన పనుల లక్ష్యాలను నిర్ధేశించుకొని ముందుకు సాగాలన్నారు. ఏ.ఈలు, డి.ఈ.ఈలు సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నపుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేసారు. అధికారులకు అప్పగించిన లక్ష్యాలు ఖచ్చితంగా సాధించాలని లేనిఎడల తొలిసారిగా షోకాజ్ నోటీస్ ఇచ్చి అనంతరం సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో గృహాలు కావలసిన వారు చాలా మంది ఉన్నారని, అందులో స్వంత స్థలం కలిగిన వారికి ప్రాధాన్యతను ఇచ్చినట్లయితే సగభాగం లక్ష్యాలు సాధించగలగుతారని సూచించారు. మిగిలిన సగభాగం లక్ష్యాలు నిర్ధిష్ట ప్రణాళిక ద్వారా పూర్తిచేయాలన్నారు. ఇంజినీరింగ్ అధికారులు సకాలంలో గృహాలు పూర్తిచేయని కారణంగా ఈ జిల్లాకు రావలసిన నిధులు ఇతర జిల్లాలకు లేదా రాష్ట్రాలకు మరలిపోతాయని ఉద్భోదించారు. అధికారుల అలసత్వం వలన ఇటువంటి తప్పిదాలు జరగరాదని, మరలా ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారులను కోరారు. ఎట్టి పరిస్థితిల్లోనూ నెలాఖరులోగా పనులు పూర్తికావాలని, ప్రతీ ఇంజినీరింగ్ అధికారి రోజుకు కనీసం 50 గృహాలైన పూర్తిచేయాలన్నారు. గృహాలతో పాటు రహదారులు, తాగునీరు, విద్యుత్ వాటిపై కూడా దృష్టి సారించి వాటిని కూడా పూర్తిచేయాలన్నారు.  ఈ సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు యం.గణపతి, రెవిన్యూ డివిజనల్ అధికారి బి.శాంతి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ , జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ పి.వెంకటరమణ, కార్యనిర్వాహక, ఉపకార్యనిర్వాహక ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.