సాటి వారికి సేవచేసే అవకాశం రావడం జీవితంలో మహద్భాగ్యమని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ విధిగా వినియోగించుకుంటూ, తమ రోజు వారీ కార్యక్రమాల్లో కొంత భాగాన్ని సేవా మార్గంలో గడపాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. సేవ చేయడం అందరికీ దొరికే అవకాశం కాదన్న ఆయన, అందులో అంతులేని ఆనందం ఉందని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ప్రేమసమాజం 90 వసంతాల వేడుకలకు గౌరవ ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వం 1930లో ఓ భజన సమాజంగా ఆధ్యాత్మిక పునాదుల మీద ఏర్పాటైన సంస్థ, తమ సేవలను విస్తృతం చేస్తూ 90 వసంతాలను పూర్తి చేసుకోవడం అభినందనీయమని తెలిపారు. శ్రీ మారేడ్ల సత్యనారాయణ గారు ప్రారంభించిన ఈ సంస్థ, వారి సతీమణి సహకారంతో ఆపన్నులకు మరింత చేరువై ఓ మహావృక్షంగా ఎదిగిన తీరు ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ దంపతుల స్మృతికి నివాళులు అర్పించారు. కుల, మత, వర్గ బేధభావాలు లేకుండా అనాథ బాలబాలికలకు ఆశ్రయం కల్పించి వారి బాధ్యతను కుటుంబంలా తీసుకోవడం, కుటుంబం కోసం తమ జీవితాన్ని ధారపోసి జీవిత చరమాంకంలో ఉన్న పెద్దలకు ఆలంబనను అందిస్తున్న పెద్దల ఆశ్రమం, కుష్టు వ్యాధి గ్రస్తుల కోసం ప్రత్యేక సేవా కేంద్రం, నారాయణ సేవ పేరిట నిత్యం అన్నదానాలు, అనాథ పార్థివ దేహాలకు అంతిమ సంస్కారాల నిర్వహణ, గోవుల సంరక్షణ, పెద్దల కోసం సకల సౌకర్యాలతో, నామ మాత్రపు రుసుములతో ప్రత్యేక ఆశ్రమాలు, పేదల కోసం ఉచిత వైద్య సేవలు, ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలబడడం, ఉచితంగా విద్యను అందించడం, ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రం, ఉచిత కంప్యూటర్ శిక్షణా కేంద్రం, గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాలు, అనాథ అమ్మాయిలకు వివాహం జరిపించడం వంటి కార్యక్రమాలతో కాలానికి అనుగుణంగా సేవాకార్యక్రమాల్లో ప్రేమసమాజం ముందుకు సాగడం అభినందనీయమని తెలిపారు.
వసుధైవ కుటుంబ భావనను బలంగా నమ్మిన ప్రేమ సమాజం పిల్లలను తమ సొంత బిడ్డలుగా భావించి యుక్త వయసు రాగానే వారికి వివాహాలు జరిపించడం, యువకులకు ఉపాధి కల్పించి సమాజంలో ఉన్నతంగా జీవించే అవకాశం కల్పించడం అభినందనీయమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. వసుధైవ కుటుంబకం అనే భావన భారతీయుల రక్తంలోనే ఉందన్న ఆయన, సాయం అనేది మనసు మీద ఆధారపడి ఉంటుందే తప్ప, స్థాయి మీద ఆధారపడి ఉండదనేది వివేకానందుల వారి సందేశాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రేమ సమాజం సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, క్రమశిక్షణతో కూడిన జీవన విధానంతో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు జీవితంలో ఎన్నో విలువైన అంశాలను నేర్పాయని తెలిపారు. తమ కుటుంబం కూడా తన బాటలో నడుస్తూ స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల సాధికారతకు కృషి చేస్తోందని, ప్రతి ఒక్కరూ సాధ్యమైనంతమేర సమాజ సేవలో ముందుకు సాగాలని సూచించారు. సేవ అంటే సమాజానికి మేలు చేయడం మాత్రమే కాదన్న ఉపరాష్ట్రపతి, అదో గొప్ప విజయసూత్రమని తెలిపారు. ఓపికగా సేవ చేయడంలో ఉన్న ఆనందం మనకు ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసం చేసే పనుల్లో విజయాలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి మనకు ఎన్నో పాఠాలను నేర్పించిందన్న ఉపరాష్ట్రపతి, ఆ సమయంలో సాటి వారికి సాయం చేసేందుకు ఎంతో మంది ముందుకు వచ్చారని, ఇది తాను సమాజంలో ఆశించిన పరిణామమని, అలాంటి గొప్ప మనసున్న వారికి అభినందనలు తెలియజేశారు. సేవా సంస్థలు ఆకలి తీర్చడంతో ఆగిపోకూడదన్న ఉపరాష్ట్రపతి, వారికి శాశ్వతంగా ఆకలి తీర్చే నైపుణ్యాభివృద్ధి మీద దృష్టి పెట్టాలని సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సేవా సంస్థలు తమ మార్గాన్ని మరింత విస్తృతం చేయాలన్న ఆయన, యువత, మహిళల్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయాలని పేర్కొన్నారు. ఇలాంటి వారికి వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, కార్పొరేట్ రంగ సంస్థలు వారికి చేయూతనందించాలని సూచించారు. “సాధన చేయండి... సంపాదించండి... సమాజం కోసం పునరంకితం కండి” అని యువతకు దిశానిర్దేశం చేసిన ఉపరాష్ట్రపతి, ప్రేమ సమాజం ప్రారంభ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళుతున్న సంస్థ అధ్యక్షులు పైడా కృష్ణ ప్రసాద్, ఉపాధ్యక్షులు బుద్ధ శివాజీ, కె. నరసింహ మూర్తి, కార్యదర్శి జగదీశ్వర రావు, ఇతర సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు పి.వి.ఎన్ మాధవ్, విశాఖ దక్షిణం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ సహా ప్రేమ సమాజం నిర్వాహకులు, సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.