నీటి ట్యాంకుల పరిశుభ్రతకు స్పెషల్ డ్రైవ్..
Ens Balu
4
Kakinada
2022-04-19 16:05:53
కాకినాడ జిల్లాలోని 385 గ్రామ పంచాయతీల్లో ఏప్రిల్ 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో 702 రక్షిత మంచినీటి సరఫరా పథకాలను శుభ్రం చేస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఎస్‌వీ నాగేశ్వర్‌నాయక్ తెలిపారు. ఈ మేరకు మంగళవారమిక్కడ ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం 202 గ్రామ పంచాయతీల పరిధిలోని 306 మంచినీటి ట్యాంకులను శుభ్రపరిచామని.. మిగిలిన వాటిని శుభ్రం చేసే ప్రక్రియను బుధవారం పూర్తిచేయనున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ డా. కృతికా శుక్లా ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి 15 రోజులకు ఓసారి తప్పనిసరిగా శుభ్రంచేసి, ఆయా తేదీలను ట్యాంకులపై నమోదుచేసేలా క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ప్రతిరోజూ మంచినీటిని క్లోరినేట్ చేసి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. సచివాలయాల పరిధిలోని ఇంజనీరింగ్ సహాయకులు ప్రత్యేక ఫీల్డ్ టెస్టింగ్ కిట్లతో నీటి నాణ్యతా ప్రమాణాలను సరిచూసి, నివేదికలు అందిస్తారని వెల్లడించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో మంచినీటి సరఫరా పూర్తి సురక్షితంగా జరిగేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్లు డీపీవో నాగేశ్వర్ నాయక్ మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.