పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు
Ens Balu
8
Srikakulam
2022-04-21 14:28:06
రాష్ట్రంలో ప్రభుత్వ నియమ నిబంధనలు విధిగా పాటిస్తూ పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్లు, యస్.పిలతో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సురేష్, ఏఐజి ఆర్.ఎన్.అమ్మిరెడ్డిలతో కలసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు 6 లక్షల మంది, ఇంటర్మీడియట్ పరీక్షలు 10 లక్షలు మంది హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ ఏడాదిలో వరుసగా పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపధ్యంలో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గతేడాది రాష్ట్రంలో ఎటువంటి సంఘటనలు తావులేకుండా పదవ తరగతి పరీక్షలు పకడ్భందీగా నిర్వహించారనే రాష్ట్రానికి మంచి పేరు ఉందని, దాన్ని అలాగే కొనసాగేలా అధికారులు చొరవచూపాలని కోరారు. ప్రస్తుతం వేసవి కాలం అయినందున విద్యార్ధులు ఎటువంటి అసౌకర్యం లోనుకాకుండా ఉండేందుకు ప్రతీ తరగతి గదిలో విద్యుత్ దీపాలు మరియు ఫ్యాన్లు ఉండాలని ఆదేశించారు. అలాగే ప్రతీ పరీక్షా కేంద్రంలో తాగునీటి సదుపాయం, వైద్య శిబిరాలను ఖచ్చితంగా ఏర్పాటుచేయాలన్నారు. ఈ నెల 27 నుండి మే నెల 9 వరకు జరగనున్న పరీక్షలకు నిర్ణీత సమయానికి ముందే విద్యార్ధులు హాజరుకావలసి ఉందని, అయితే సుదూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్ధులు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నందున అటువంటి వారికి సమయపాలనలో కొంత వెసులుబాటు కల్పించాలని సూచించారు. విద్యార్ధులు తమ హాల్ టికెట్లు చూపి ఆర్.టి.సి బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. కోవిడ్ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కును ధరించాలని, కోవిడ్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పరీక్షల నిర్వహణలో ఆయా శాఖలు తమ పాత్రలను సక్రమంగా నిర్వహించాలని, పరీక్షల నిర్వహణ సమయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఇప్పటికే ప్రతీ కేంద్రానికి ప్రశ్నపత్రాలు వచ్చాయని, వాటిని సరిచూసుకోవాలని సూచించారు. జవాబు పత్రాలను ఈసారి బుక్ లెట్ రూపంలో పొందుపరచడం జరిగిందని, దీనివలన విద్యార్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే పరీక్షలయినప్పటికీ గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, అదనపు పథక సమన్వయకర్త ఆర్.సూర్యప్రకాశ్, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ సహాయ కమీషనర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.