వైద్యులే నిజమైన ప్రాణదాతలు..
Ens Balu
3
Srikakulam
2022-04-21 14:49:50
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి పునర్జన్మను ప్రసాదించేది కేవలం వైద్యులేనని అందుకే వైద్యులు ప్రాణదాతలని ప్రజలు నమ్ముతారని శ్రీకాకుళం లోక సభ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. ఎం.పి.ల్యాడ్ నిధులు రూ.28 లక్షలతో కొనుగోలు చేసిన వాహనానికి (బస్సు) ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి, జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వాహనాన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అంకితం చేశారు. మీకు వైద్యం... మాకు వరం.. అన్న నినాదంతో వాహనాన్ని వైద్యులకు అందచేశారు. సకాలంలో వైద్యులు స్పందిస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారవుతారని, ఇందుకు ఈ వాహనం ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డా. ఎ. స్వామినాయుడు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.రవి వెంకటాచలం, హనుమంతు సాయిరాం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.