ఏ ఒక్క గిరిజనుడూ నష్టపోకూడదు..
Ens Balu
7
Paderu
2022-04-21 14:57:21
అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లాలోని గిరిజన రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ ఉద్యాన శాఖలతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు లాభం చేకూరే విధంగా సంబంధిత అధికారులు తగు సూచనలు అందజేయాలని ఆదేశించారు. వెబ్సైట్లో రైతుల పూర్తి వివరాలు ఉండాలని, ఆధార్, బ్యాంక్ ఐఎఫ్సి కోడ్, ఎన్ పి సి ఐ తదితర ఫెయిల్యూర్స్ లేకుండా కెవైసి చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో గ్రామ వ్యవసాయ సహాయకులు బ్యాంకర్లను సంప్రదించి తప్పులను సవరించాలి అన్నారు. రానున్న పది రోజులలో కేవైసీ పూర్తి చేసి రైతులకు సబ్సిడీ, రుణాలు మంజూరుకు సహకరించాలని ఆదేశించారు. ప్రతి మండల వ్యవసాయ అధికారి తన పరిధిలో కనీసం 100 ఎకరాలు అభివృద్ధి చేసి ప్రాంతాన్ని బట్టి కాఫీ, పసుపు, చిరుధాన్యాలు, జీడి, రాజ్మా లాంటి వంటలను అభివృద్ధి చేసి ఫలసాయం పొందే విధంగా రైతులకు మార్గదర్శకం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ యంత్రాలు పనిముట్లు సబ్సిడీ రుణాలకు అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రైతు భరోసా అందజేసేందుకు వీలుగా అటవీ హక్కుల లబ్ధిదారులను గుర్తించాలని, అటవీ హక్కు దారులు డాటా సవరించాలని సూచించారు. గిరి రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తయారుచేసి ఉద్యాన శాఖ కమిషనర్ సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ బి ఎస్ నందు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ రమేష్ కుమార్ రావు, ఉద్యాన శాఖ అధికారి అశోక్, వ్యవసాయ సహాయ సంచాలకులు, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.