విస్తరణ పనులు వేగవంతం చేయాలి..
Ens Balu
11
Kakinada
2022-04-21 15:17:45
కాకినాడ జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి గురువారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ.. ట్రెయినీ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి జాతీయ రహదారులు, రెవెన్యూ, అటవీ, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారత్‌మాల విస్తరణ ప్రాజెక్టులకు సంబంధించిన పనుల్లో పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వాకలపూడి-అన్నవరం, అచ్చంపేట-సామర్లకోట, కత్తిపూడి-తాళ్లరేవు (216) ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించి మిగిలియున్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి యుద్ధప్రాతిపదికన ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో కాకినాడ, పెద్దాపురం ఆర్‌డీవోలు బీవీ రమణ, జె.సీతారామారావు, జాతీయ రహదారుల పీడీ రవీంద్రబాబు, వివిధ మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.