పది, ఇంటర్ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు


Ens Balu
6
Anakapalle
2022-04-21 16:35:01

ఏప్రిల్ మే నెలల్లో జరిగే 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటంశెట్టి అధికారులను ఆదేశించారు.  గురువారం కలెక్టర్ కార్యాలయంలో పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 27వ తేదీ నుండి మే 6వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయని అదేవిధంగా మే 6వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయని చెప్పారు.  మొత్తం పరీక్షలను ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికాయుతంగా పరీక్షలు నిర్వహించాలన్నారు.  జిల్లాలో 24 మండలాల్లో 122 కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలు  ఉదయం 9:30 నుండి 12:30 వరకు జరుగుతాయని ఈ పరీక్షలకు 22904 మంది విద్యార్థులు, ఓపెన్ స్కూల్ విద్యార్థులు 2500 మంది హాజరవుతారన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు  ఉదయం 9:00 గం.ల నుండి12:00 గం.ల వరకు మొత్తం 34 కేంద్రాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 

పరీక్షల ఏర్పాట్లను కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ పర్యవేక్షిస్తారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని,    ఆర్డబ్ల్యూఎస్, జీవీఎంసీ అధికారులను పారిశుద్ధ్యం నిర్వహించాలని పంచాయతీ అధికారిని  ఆదేశించారు.  పరీక్షలకు వచ్చి వెళ్లేందుకు అనుకూలమైన సమయాల్లో విద్యార్థులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ వారిని   రాత్రి సమయాల్లో విద్యుత్ పవర్ కట్ లు లేకుండా చూడాలని ఏపీ పీ డి ఎసి ఎల్ అధికారులను ఆదేశించారు. వేసవి ఎండల దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని నియమించి అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్  అమలు చేయాలన్నారు. జిల్లా వృత్తి విద్యా అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి పరీక్షల నిర్వహణ అధికార్లుగా వ్యవహరిస్తారన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకట రమణ, ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి ఎం వినోద్ బాబు, డి వి ఈ ఓ మురళీధర్, జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి, పోలీస్ జీవీఎంసీ ఆర్డబ్ల్యూఎస్ పంచాయితీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.