31వరకూ ఆర్బీకేల్లో అవగాహనా సదస్సులు


Ens Balu
13
Parvathipuram
2022-04-22 06:13:30

పార్వతీపురం మన్యం జిల్లాలో రైతు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈ నెల 21వ తేదీ నుండి మే నెల 31వ తేదీ వరకు ఆయా ఆర్.బి.కెల పరిధిలో ఉదయం 11 గంటల నుండి సదస్సులు జరుగుతాయని అన్నారు. వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాంప్రదాయక విధానాలతో రైతు పూర్తి స్థాయి ఉత్పాదకత పొందలేక పోతున్నారని ఆయన పేర్కొంటూ ఆధునిక యాంత్రిక వ్యవసాయ పరికరాల వినియోగం, శాస్త్రజ్ఞుల సలహాలు, సూచనలు పాటించడం వల్ల రెట్టింపు ఉత్పాదకత పొంద వచ్చని ఆయన అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా రైతులు కష్టపడే తత్వం గలవారని, దీనికి తోడుగా యంత్రాలను, మంచి విత్తనాలు, వ్యవసాయ యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా గోదావరి జిల్లాల ఉత్పాదకతతో సమానంగా దిగుబడి రాగలదని ఆయన చెప్పారు. రైతు భరోసా కేంద్రాలను (ఆర్.బి. కె) రైతులకు పూర్తి సహాయ సహకారాలు అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ఉద్దేశం అని ఆయన చెప్పారు. ఆర్.బి.కెల పరిధిలో విత్తనం నుండి విక్రయానికి అవసరమగు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చెప్పారు. వ్యవసాయం పక్కా ప్రణాళికతో చేపట్టడం వలన వ్యవసాయాన్ని లాభసాటిగా మలచుకోవచ్చని అన్నారు. ఆర్.బి.కెలలో వై.ఎస్.ఆర్. యంత్ర సేవా కేంద్రాలు (కస్టమ్ హాయరింగ్ కేంద్రాలు)  ఏర్పాటు చేసి ఆధునిక వ్యవసాయ పనిముట్లు రైతుకు అందుబాటులో పెట్టడం జరిగిందని అన్నారు. రానున్న ఖరీఫ్ దృష్ట్యా రైతులు ఇప్పటి నుంచే సిద్దంగా ఉండాలని, అపరాల వంటి అంతర పంటలు వేయటం, నీటి యాజమాన్య పద్ధతులు పాటించడం, ఏ రకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వినియోగించాలి, ఏ పరిమాణంలో వినియోగించాలి, పొలంలో నడక దారి వదలడం, నూర్పులలో పాటించాల్సిన నియమాలు, రబీలో అనుసరించాల్సిన పద్ధతులు తదితర అంశాలపై అవగాహన కల్పించుటకు రైతు సదస్సులు ఏర్పాటు చేశామని నిశాంత్ కుమార్ వివరించారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వ్యవసాయ అధికారులు సదస్సుల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ద వహించాలని, రైతులకు పూర్తి అవగాహన కల్పించి ఫలవంతం కావడానికి కృషి చేయాలని ఆయన సూచించారు.