రాష్ట్ర ప్రభుత్వం గిరిజన జిల్లాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నదని, కావున జిల్లాలో మంజురు అయిన భవనాలు, రోడ్లు నిర్మాణ పనులను వెంటనే మొదలుపెట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇంజనీరింగ్ అధికారులను అదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలం వారీగా రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, హెల్త్ సెంటర్స్, రోడ్లు పనులు జరుగుతున్న తీరును సమీక్షించారు. చాలా మండలాలలో పనులు మొదలు కాక పోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. 28 వ తేది కల్లా మొత్తం పనులు గ్రౌండింగ్ పూర్తి చేయాలని తెలిపారు. లకరి మొదలు అయ్యే సమయానికి యిబ్బంది లేకుండా పనులు వేగవంతం చేయాలన్నారు. నిర్మాణానికి అవసరం అయిన మెటీరియల్ ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
28 వ తేది తరువాత క్షేత్రస్థాయి పర్యటన లో జరుగుతున్న పనులను పరిశీలించడం జరుగుతుందని, సరియైన పనితీరు కనపరచని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమీక్షా సమావేశం లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, మండల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.