ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోందని జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. అందుకే వైద్య రంగానికి మన ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని చెప్పారు. అజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం క్రింద జిల్లా కేంద్రాసుపత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆరోగ్య మేళాను జెడ్‌పి ఛైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, ఈ ఆరోగ్య మేళాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వీటిని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఆరోగ్య మేళాలను గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, దీనికి వైద్యారోగ్యశాఖ కృషి చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే ఆరోగ్య మేళాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని అన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఐడి కార్డులు చాలా ఉపయోగకరమని, దీనివల్ల ఆయా వ్యక్తుల పూర్తి ఆరోగ్య చరిత్రను ఈ కార్డుల ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. హెల్త్ ఆధార్ లాంటి ఈ ఐడి కార్డులను ప్రతీఒక్కరికీ త్వరితగతిన జారీ చేయాలని సూచించారు.
మన ప్రాంత ఆహార అలవాట్లు, సామాజిక స్థితిగతుల కారణంగా ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా క్షయ, కుష్టు, సికిల్ సెల్ ఎనీమియా లాంటి వ్యాధులతో బాధ పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఆర్థిక, సామాజిక పరిస్థితులు, విద్యతో సంబంధం లేకుండా, చాలా ఎక్కువమంది రక్తహీనతతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రధానంగా మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం, శారీరక శ్రమ లేకపోవడమే దీనికి కారణమని అభిప్రాయపడ్డారు. అత్యంత చౌకగా దొరికే వేరుశనగ, నిమ్మ, ఉసిరి, బెల్లం లాంటి ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా, రక్తాన్ని సులువుగా పెంచుకోవచ్చని సూచించారు. చిన్న వయసులోనే వివాహాల వల్ల, మహిళల్లో ఎన్నో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని చెప్పారు. చిన్న వయసులో వివాహాలను నివారించేందుకు, జిల్లాలో మహిళా జాగృతి యాత్రలను ప్రారంభించామని, ఒక ఉద్యమంలా ఈ అవగాహనా కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్య మేళాలను, అవగాహనా కార్యక్రమాలను వినియోగించుకోవడం ద్వారా, ప్రతీఒక్కరూ తప్పనిసరిగా తమ దృక్ఫథాన్ని మార్చుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఆరోగ్య మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ శిబిరాలను జెడ్‌పి ఛైర్మన్, కలెక్టర్ ముందుగా సందర్శించారు. ఆరోగ్య పరీక్షల శిబిరం, ఆయుష్మాన్ భారత్ ఐడి కార్డుల జారీ, అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ, క్షయ, చెవి, గొంతు, ముక్కు వ్యాధుల విభాగం, ఎయిడ్స్, కుష్టువ్యాధి శిబిరం, ఆయుష్ విభాగం, రక్త పరీక్షల శిబిరం, మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ వ్యాధుల నిర్ధారణా శిబిరం, కంటి విభాగం తదితర శిబిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సహజ కాన్పు వల్ల కలిగే ప్రయోజనాలు, సిజేరియన్ ఆపరేషన్ల వల్ల తలెత్తే సమస్యలపై లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. చిన్నవయసులో చేసే వివాహాల వల్ల కలిగే అనర్ధాలపైనా, అవయవదానం చేయాల్సిన ఆవశ్యకతపైనా, ప్రదర్శించిన స్కిట్‌లు ఆలోచింపజేశాయి. వైద్యులు, సిబ్బంది ప్రదర్శించిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డిసిహెచ్ఎస్ డాక్టర్ లక్ష్మణ్, ఆసుపత్రి సూపరింటిండెంట్ సీతారామరాజు, ఆర్ఎంఓ డాక్టర్ సత్యశ్రీనివాస్, మాజీ డిసిఎంఎస్ ఛైర్మన్ కెవి సూర్యనారాయణరాజు, వివిధ వైద్య విభాగాల అధిపతులు, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.