స్పందనకు వచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం పాడేరు ఐటిడిఏ సమావేశ మందిరంలో సబ్ కలెక్టర్ వి. అభిషేక్, డి ఆర్ ఓ బలివాడ దయానిధితో కలిసి వివిద మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ముందుగా అధికారులతో స్పందన సమస్యల పరిష్కారంపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందనలో వివిద శాఖలకు వచ్చిన ఫిర్యాదుల వివరాలు అధికారుల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. ఆర్దిక, ఆర్దికేతర ఫిర్యాదులను విభజించి సమస్యలను త్వరితగతిన పరిష్కారించాలన్నారు. అధికారులు కచ్చితంగా క్షేత్ర పర్యటనలు చేయాలన్నారు. రహదారులు భవనాలు, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను ఆదేశించారు. అనంతరం అర్జీదారుల నుండి 92 ఫిర్యాదులు స్వీకరించారు. తాగునీటి సమస్యలు, ఉపాధి కల్పన, రోడ్లు నిర్మాణాలు, సామాజిక పింఛన్లు, భూ సమస్యలపై ఎక్కవగా ఫిర్యాదులు అందాయి.స్వీరిస్తున్న ఫిర్యాదులపై అక్కడికక్కడే అధికారులతో జిల్లా కలెక్టర్ చర్చించి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసారు.
స్పందనలో కొన్ని ఫిర్యాదులు ఇలా..
హుకుంపేట మండలం రంగశీల గ్రామానికి చెందిన సాగిరి రామారావు తన పట్టానెం 124 సర్వే నెం. 91-1 , 0.34 సెంట్ల భూమి సాగిరి మాణిక్యాలరావు పట్టాలో కలిసి పోయిందని దానిని సర్వేనెం.90-1 నమోదు చేయాలని వినతి ప్రత్రం సమర్పించారు. హుకుంపేట మండలం సంతారి గ్రామ సర్పంచ్ పాడి అప్పల నాయుడు చిన బూరుగుపుట్టు గ్రామంలో చేతి పంపు ఉందని తాగునీటి ఇబ్బందులు పడుతున్నామని, సోలార్ సిస్టం ఏర్పాటు చేసి తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. అరకు వ్యాలీ మండలం మాడగడ పంచాయతీ గత్తరగుడ గ్రామానికి చెందిన వికలాంగుడు కొర్రా గోవింద్, పాడేరు మండలం కందమామిడి గ్రామస్తురాలు ఎం.లక్ష్మి కుమారి ఉద్యోగం కోసం దరఖాస్తులను సమర్పించారు. జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ చేరువీది గ్రామస్తులు కె.చిట్టిబాబు, ఎ.బొంజునాయుడు, కె.చిలకమ్మ, తదితర 26 మంది గిరిజనులు చేరువీది గ్రామం నుండి పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ కింత్రేలు గ్రామం వరకు తారురోడ్డు నిర్మించాలని కోరారు. డుంబ్రిగుడ మండల గుంటగన్నెల పంచాయతీ జాకరవలస గ్రామానికి చెందిన తెడబారికి రాజారావు వృధ్ధాప్య పింఛను మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు. ఆదివాసీ మహా సభ అధ్యక్షులు కొర్రా అప్పారావు హుకుంపేట మండలం బిజ్జాపల్లి పాఠశాలకు ప్రహారీ గోడ నిర్మించాలని దరఖాస్తును అందజేసారు. ఈ కార్యక్రమంలో ఐటిడి ఏ ఎపి ఓలు వి ఎస్ ప్రభాకర రావు, ఎం. వేంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు సి ఎ మణికుమార్, రహదారులు భవనాల శాఖ ఇ ఇ బాల సుందరరావు, జిల్లా వైద్యాధికారి డా. ఎల్.రామ్మోహన్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇ ఇ జవహార్ కుమార్, డివిజనల్ పంచాయతీ అధికారి పి ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.