ప్రతీ ఎకరాకు నీరు అందాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కోరారు. పనులను వేగవంతంగా, నాణ్యతతో చేపట్టాలని ఆయన సూచించారు. జలవనరుల శాఖతో కలెక్టర్ కార్యాలయంలో శని వారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌళిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. మౌళిక సదుపాయాలు కల్పన వలన ప్రజలకు ప్రయోజనం ఉంటుందని, ఎక్కువ ఆయకట్టుకు నీరు అందాలని ఆయన పేర్కొన్నారు. పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా జలవనరుల కాలువల పూడిక తీతతో పాటు గట్లను బలోపేతం చేయాలని ఆయన ఆదేశించారు. సహాయ ఇంజినీర్లు వారీగా వారం రోజులలో పనులను గుర్తించి సమాచారం అందించాలని ఆయన ఆదేశించారు. గ్రామ స్థాయిలో ఉండే ప్రతి అంశాన్ని క్షణ్ణంగా పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి పని పట్ల స్పష్టమైన సమాచారం ఉండాలని ఆయన చెప్పారు.జలవనరుల శాఖ ఉత్తరాంధ్ర చీఫ్ ఇంజనీర్ ఎస్.సుగుణాకరరావు తోటపల్లి పనులు రూ.52 కోట్లుతో అవుతున్నాయన్నారు. రెండు ప్యాకేజీలుగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. 12 ఎకరాలు భూసేకరణ అవసరం ఉందని, భూసేకరణ అంశాలు కొన్ని పరిష్కారం కావల్సి ఉందని, కొన్ని ప్రాంతాల్లో డి పట్టాలు కలిసి ఉన్నాయని వివరించారు.
మన్యం జిల్లాలో తోటపల్లి భారీ తరహా జలవనరుల ప్రాజెక్టు అని చెప్పారు. నందివానివలస ఆర్ అండ్ ఆర్ కాలనీ అంశాలు పరిష్కారం కావల్సి ఉందని ఆయన తెలిపారు. వరి ప్రధాన పంట అని, రబీలో అపరాల సాగు ప్రధానంగా జరుగుతుందని అన్నారు. మన్యం జిల్లాలో తోటపల్లి క్రింద పాత ఆయకట్టు 41 వేల ఎకరాలు, కొత్త ఆయకట్టు 15 వేల ఎకరాలు సాగు అవుతోందని వివరించారు. జంఝావతి ప్రాజెక్ట్ పై రబ్బరు డ్యాం నిర్మించి 9 వేల ఎకరాలకు సాగు నీరు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. హై లెవెల్, లో లెవెల్ కెనాల్ ఉందన్నారు. జిల్లాలో మధ్య తరహా జలవనరుల ప్రాజెక్టుల క్రింద 74 వేల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు.
ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎన్.రాంబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (జంజావతి) ఎన్. శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఇరిగేషన్) పార్వతీపురం ఆర్. అప్పలనాయుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (తోటపల్లి) ఆర్. రామచంద్రరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఇరిగేషన్) శ్రీకాకుళం డి.శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎస్.ఐ.డివిజన్) పి. అప్పలనాయుడు, డిప్యూటీ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.