ఎండల తీవ్రత పట్ల అప్రమత్త అవసరం


Ens Balu
9
Parvathipuram
2022-04-23 07:43:53

ఎండ తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్  కుమార్ కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. వేసవి రీత్యా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా యని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అత్యవసర పని ఉన్నప్పుడు మాత్రమే బయటకు వెళ్లాలని లేదంటే ఇంటి వద్దనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బయటకు అత్యవసర సమయాల్లో వెళ్లేటప్పుడు గొడుగు లేదా టోపి తరలించాలని, లేతరంగు వదులుగా ఉండే దుస్తులు ధరించడం మంచిదని ఆయన పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు నీడపట్టున ఉండటం మంచిదని సూచించారు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు తిరగవద్దు అని ఆయన కోరారు. శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు తీసుకోవద్దని, అధిక ప్రోటీన్ ఉండే పదార్థాలను కూడా తీసుకోవద్దని ఆయన పేర్కొన్నారు. తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం కలిగిఉండటం, మత్తు నిద్ర, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి వంటివి వడదెబ్బ లక్షణాలని వీటిని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. స్థానిక వాతావరణ సమాచారాన్ని వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకొని తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. తరచూ మంచి నీటిని తాగాలని, ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు కలిపిన నీరు తాగవచ్చని ఆయన అన్నారు. వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానిచో దగ్గర లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని ఆయన పేర్కొన్నారు. తీవ్రమైన ఎండలో బయటకు వచ్చినప్పుడు తలతిరుగుట, ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. ఇంటి వాతావరణం వీలైనంత మేరకు చల్లదనం ఉండే విధంగా చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పనుల్లో ఉన్న కూలీలు పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధి హామీ సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయాలను విధిగా పాటించాలని ఆయన పేర్కొన్నారు. ఎండ తీవ్రత లేని సమయంలో ఉపాధి హామీ పనులు చేపట్టాలని సూచించారు. ఎండ వేడిమిని గమనిస్తూ ఎవరూ వడదెబ్బకు, అనారోగ్యానికి గురి కావద్దని సూచనలు జారీ చేశారు.