కోవిడ్ వేక్సినేషన్ సత్వరమే పూర్తిచేయాలి
Ens Balu
4
Parvathipuram
2022-04-23 09:11:26
కోవిడ్ వాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు జె.నివాస్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శని వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వాక్సినేషన్ వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. కోవిడ్ వ్యాప్తి జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. కోవిడ్ నిబంధనలు ప్రజలు పాటించే విధంగా అవగాహన కల్పించాలని తద్వారా నాలుగవ దశ వ్యాప్తిని నివారించుటకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ఆయన ఆదేశించారు. గర్భిణీలను గుర్తించి వారి ప్రసవ తేదీల జాబితాను సిద్ధం చేసి ఆసుపత్రిలో ముందుగానే చేర్చాలని ఆయన సూచించారు. తద్వారా ప్రమాదకర పరిస్థితులు ఎదురుకావని ఆయన స్పష్టం చేశారు. వైద్య అధికారులు, సిబ్బంది విధిగా బయో మెట్రిక్ వేయాలని ఆయన చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వాగ్దేవి, తదితరులు పాల్గొన్నారు.