అనకాపల్లి జిల్లాలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో చేపట్టిన లేఅవుట్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటంశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీలకు సంబంధించి విద్యుత్ సరఫరా బోరుబావులు అప్రోచ్ రోడ్ల పనులు తక్షణం పూర్తయ్యేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గాల వారీగా ఇళ్ల నిర్మాణం పై క్షుణ్ణంగా చర్చించారు. ప్రతిపాదించిన లేఅవుట్లు, మంజూరు చేసిన గృహాల నిర్మాణాల పురోగతిని తెలుసుకున్నారు. వివిధ స్థాయిల్లో ఉన్న ఇళ్ళ పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. వివిధ శాఖల సమన్వయంతో లబ్ధిదారులను ప్రోత్సహించి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. విధినిర్వహణలో అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. ఏ.ఈ, డీ.ఈ. లు నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉండాలన్నారు. అవసరమైన చోట్ల బోరుబావులను వెంటనే ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు లేఅవుట్ల నిర్మాణాల్లో, గృహ నిర్మాణాలు ప్రారంభించడంలో ప్రగతి చూపించిన పెందుర్తి, ఎలమంచిలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. అదే స్ఫూర్తితో మిగిలిన వారు కూడా పనిచేసి గృహనిర్మాణంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలన్నారు. నిర్మాణాలు మందకొడిగా ఉన్న మండలాలను పరిశీలించవలసిందిగా అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవో లను ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను పై అధికారులకు తెలియజేస్తూ ఉండాలన్నారు. నిర్మాణ సామాగ్రి ప్రణాళికాయుతంగా సరఫరా చేస్తూ ఉండాలన్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి, నర్సీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారులు చిన్నికృష్ణ, గోవిందరావు, నర్సీపట్నం డి ఎల్ డి ఓ సత్యనారాయణ జిల్లా గృహనిర్మాణ అధికారి రఘురామ, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఉమా శంకర్ గృహ నిర్మాణ శాఖ ఈ.ఈ.లు డి.ఈ.లు తదితరులు పాల్గొన్నారు.