తిరుమలలో ఈఓ విస్త్రుత తనిఖీలు


Ens Balu
9
Tirumala
2022-04-23 12:15:04

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో దృష్టిలో టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి శనివారం అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ తో కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో భక్తుల క్యూలైన్లు, లగేజీ డిపాజిట్ కౌంటర్లు, స్కానింగ్ యంత్రాలను పరిశీలించారు. అక్కడి ఉచిత వైద్యశాలలో భక్తులకు అందుతున్న వైద్యసేవలు తనిఖీ చేశారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు పంపిణీ చేసేందుకు అన్నప్రసాదాలు తయారు చేసే వంటశాలను పరిశీలించారు. కంపార్ట్మెంట్ల నిర్వహణ, కంపార్ట్మెంట్ల నుండి భక్తులను దర్శనానికి వదలడం, తోపులాటలు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో సెల్లార్ లో మరుగుదొడ్ల పరిశుభ్రతను తనిఖీ చేశారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అందుతున్న ప్రసాదాల వితరణ విధానాన్ని, వంటశాలను పరిశీలించారు.  ఆ తర్వాత పిఎసి-1, 2, 3లలో భక్తుల సౌకర్యాలను పరిశీలించారు. కళ్యాణకట్ట, లాకర్ల కేటాయింపు విధానం, డార్మిటరీల్లో భక్తులకు కల్పించిన వసతులను పరిశీలించారు. ఈవో వెంట డెప్యూటీ ఈఓలు  రమేష్ బాబు,  హరీంద్రనాథ్,  పద్మావతి, భాస్కర్,  రామారావు, విజిఓ  బాలిరెడ్డి, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, డిఎఫ్ఓ   శ్రీనివాసులురెడ్డి, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్  శ్రీనివాసులు, ఇతర అధికారులు ఉన్నారు.