24నుంచి కేసీసీ రుణాల ప్రత్యేక డ్రైవ్
Ens Balu
3
Kakinada
2022-04-23 14:07:01
పంట సాగు చేసే ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా రుణాలు, సంబంధిత ఇతర ప్రయోజనాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డులు-రుణాలపై శనివారం కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ఇలక్కియ టెలీకాన్ఫరెన్స్ ద్వారా బ్యాంకర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల మేరకు నాబార్డు, లీడ్‌బ్యాంకు, వ్యవసాయ శాఖ, మత్స్యశాఖ, పశు సంవర్థక శాఖ, ఇతర అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి మే 1 వరకు కిసాన్ భాగీదారీ ప్రాథమిక హమారీ పథకం కింద కేసీసీ రుణాల మంజూరుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్‌బీకే/గ్రామ సచివాలయ పరిధిలో గ్రామ సభలు ఏర్పాటుచేసి, అర్హత ఉండి ఇప్పటి వరకు ఎలాంటి రుణాలు పొందని వ్యవసాయ, పాడి, మత్స్య రైతులు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని జేసీ అధికారులకు సూచించారు. పీఎం కిసాన్ రుణ అర్హత ఉన్న ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్.శ్రీనివాసరావు, నాబార్డు డీడీఎం డా. వైఎస్ నాయుడు; కాకినాడ, పెద్దాపురం ఆర్‌డీవోలు బీవీ రమణ, జె.సీతారామారావు, ఇవివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.