విజయనగరం జిల్లాలో గత కొద్ది రోజులుగా రోజురోజుకూ ఉష్ణోగ్రత పెరుగుతున్న కారణంగా, వడగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఒక ప్రటనలో కోరారు. మరికొద్ది రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాస్త్రవేత్తల సూచనలను బట్టి ప్రతీఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఎండవేడిమి ఉండే సమయాల్లో వీలైనంతవరకు బయటకు రాకుండా ఉండాలని, తప్పనిసరి పరిస్థితిల్లో బయటకు వచ్చే పక్షంలో, వేడినుంచి రక్షణ కల్పించేందుకు టోపీలు, గొడులు లాంటి పరికరాలను వినియోగించాలని, తమ చెంత మంచినీటిని ఉంచుకోవాలని సూచించారు. ఈ వేసవిలో లూజుగా ఉన్న కాటన్ దుస్తులను, తెలుపు రంగు దుస్తులను ధరించడం శ్రేయస్కరమని తెలిపారు. ముఖ్యంగా వృద్దులు, చిన్నపిల్లల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎక్కువగా ఎండ కాసే ఉదయం 10 గంటలు నుంచి సాయంత్రం 4 గంటలు మధ్య బయట తిరగడం, ఆరుబయట పనిచేయడం లాంటివి చేయకూడదని సూచించారు. ఈ వేసవి కాలంలో చల్లని శీతల పాణీయాలను త్రాగకూడదని, రోడ్ల ప్రక్కన అమ్మే కలుషిత ఆహారాన్ని తినకూడదని, మాంసారాన్ని, మసాలాలను తినకూడదని, మద్యం సేవించకూడదని తెలిపారు.
వడదెబ్బ తగలకుండా ప్రతీఒక్కరూ అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలను పాటించాలని కలెక్టర్ సూచించారు. ఎక్కువగా ద్రవపదార్ధాలను, ఓఆర్ఎస్ లాంటి ద్రావకాలను తీసుకోవాలన్నారు. ఎండ తీవ్రత వల్ల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా 104.9 డిగ్రీల వరకు పెరిగిపోయి, దానిని నియంత్రించే శక్తికి శరీరం కోల్పోవడమే వడదెబ్బగా పరిగణిస్తారని తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే ఇది ప్రాణాంతకమని పేర్కొన్నారు. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం, వణుకు పుట్టడం, మగత నిద్ర లేదా కలవరింతలు, ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి వడదెబ్బ లక్షణాలని తెలిపారు. ప్రమాదవశాత్తూ ఎవరైనా వడదెబ్బకు గురి అయితే, వారిని నీడలో ఉంచి, గాలి తగిలేలా చేసి, తడి గుడ్డతో తుడిచి శరీరాన్ని చల్లబరచాలని సూచించారు. వీలైతే వారికి ఉప్పు కలిపిన మజ్జిగను, గ్లూకోజ్, ఓఆర్ఎస్ లాంటివాటిని ఇవ్వాలని చెప్పారు. అయితే వడదెబ్బకు గురై, అపస్మారక స్థితికి చేరినవారికి మాత్రం నీరు త్రాగించకూడదని స్పష్టం చేశారు. వారిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. వడదెబ్బకు తక్షణ చికిత్స నందించేందుకు అవసరమైన మందులను అన్ని ఆసుపత్రుల్లో సిద్దంగా ఉంచామని కలెక్టర్ తెలిపారు.