మే3న సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం..
Ens Balu
4
Simhachalam
2022-04-24 07:41:30
ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం ,భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో మే 3న అప్పన్న నిజరూప దర్శనం ఉత్సవము జరగనుంది. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియనాడు సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ ఈవో ఎంవీ సూర్య కళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయజర్నలిస్ట్ లు సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ఈ మేరకు సింహాద్రి నాధుడు ను దర్శించుకున్న అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించి ఈ నెల 26న తొలివిడత చందనం అరగ తీత కార్యక్రమం వైభవంగా ప్రారంభం కానుందన్నారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు సంబంధించి ఆలయ వర్గాలు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. మంగళ వారం తెల్లవారుజామున సింహాద్రి నాథుడును సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన చేస్తారన్నారు. అనంతరం గంగ ధార నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహిస్తారన్నారు. తదుపరి వేద మంత్రోచ్ఛారణలు మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ చందనము చెక్కలను శిరస్సుపై ఉంచుకొని అర్చక స్వాములు ఆలయ బేడా మండపం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారన్నారు. తొలుత వాటికి విశ్వక్సేన, పుణ్యాహవాచనం ఆరాధన కార్యక్రమంలు నిర్వహించి శాస్త్రోక్తంగా అరగతీత ప్రారంభమవుతుందని శ్రీనుబాబు తెలియజేశారు. తొలిసారిగా అరగదీసిన చందనాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచి అర్చన గావిస్తారన్నారు... ఇలా నాలుగు రోజుల పాటు అరగదీసిన మూడు మణుగుల (125 కేజీ లు) చందనానికి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ఆలయ భాండాగారంలో భద్రపరచడం జరుగుతుందన్నారు.. నిజరూప దర్శనం రోజు రాత్రికి ( మే 3) వివిధ రకాల ఫల, పుష్పా సీతలాదులతో కూడిన సహస్ర ఘటాభిషేకం స్వామి కి నిర్వహించి తొలివిడతగా మూడు మణుగుల చందనాన్ని ఆ స్వామి కి సమర్పిస్తారనీ శ్రీను బాబు వివరించారు. ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈవో ఎంవీ సూర్యకళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారని ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షన చేస్తున్నట్లు చెప్పారు.