కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ విజయనగరం జిల్లా పర్యటన ఏర్పాట్లను, కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదివారం స్వయంగా పరశీలించారు. ఈనెల 25వ తేదీన కేంద్రమంత్రి జిల్లాకు చేరుకొని, 26వ తేదీన పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. విజయనగరం పట్టణ పేదలకోసం గుంకలాంలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీని కేంద్రమంత్రి సందర్శించనున్న నేపథ్యంలో, కలెక్టర్ సూర్యకుమారి ఈ కాలనీని పరిశీలించారు. అధికారులతో మాట్లాడి, ఏర్పాట్లపై సమీక్షించారు. హౌసింగ్ పిడి ఎస్‌వి రమణమూర్తి, ఇతర అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. ఈ పర్యటనలో హౌసింగ్ ఇఇ శ్రీనివాసరావు, ఇతర ఇంజనీర్లు పాల్గొన్నారు. జిల్లా మహారాజా ప్రభుత్వ కేంద్రాసుపత్రిని కలెక్టర్ సందర్శించారు. మంత్రి పర్యటనకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ సీతారామరాజు, ఇతర అధికారులతో చర్చించారు. పర్యటనకు పకడ్భందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.