కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ జిల్లా పర్యటన ఖరారయ్యింది. ఆయన విస్తృత పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్రమంత్రి పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25వ తేదీ సోమవారం సాయంత్రం 6.45 గంటలకు కేంద్రమంత్రి మన్సుఖ్ జిల్లాకు చేరుకొని, విజయనగరం పట్టణంలోని ఎస్-కన్వెన్షన్ హాలులో మేధావులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పార్టీ నాయకులతో సమావేశమవుతారు. రాత్రి జెడ్‌పి అతిధిగృహంలో బసచేస్తారు. 26వ తేదీ ఉదయం 8.30కు బయలుదేరి, గుంకలాం మెగా హౌసింగ్ లేఅవుట్‌ను పరిశీలిస్తారు. అక్కడినుంచి 9.30 గంటలకు బొండపల్లి మండలం గొట్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను చేరుకొని, నాడూ-నేడు పనులను పరిశీలిస్తారు. అక్కడినుంచి బయలుదేరి, 10.15 గంటలకు నెల్లిమర్ల మండలం రామతీర్ధం చేరుకొని, శ్రీ సీతారామస్వామి వారి ఆలయాన్ని సందర్శిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం 10.30 గంటలకు పూసపాటిరేగ మండలం కుమిలి చేరుకొని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా జరుగుతున్నఅభివృద్ది పనులను పరిశీలిస్తారు. రైతులతో, వలంటీర్లతో మాట్లాడతారు. పేదల ఇంటింటికీ నిత్యావసరాలను పంపిణీ చేసే ఎండియు యూనిట్‌ను పరిశీలిస్తారు. అక్కడినుంచి బయలుదేరి 11.45కి విజయనగరంలోని జిల్లా కేంద్రాసుపత్రిని సందర్శిస్తారు. తిరిగి 12.45కి జిల్లా పరిషత్ అతిధిగృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.45 గంటలకు అక్కడినుంచి బయలుదేరి, కలెక్టరేట్ ఆడిటోరియం వద్ద ఏర్పాటు చేయనున్న ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. 2.15 గంటలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆధ్వర్యంలో అధికారులతో సాయంత్రం 4 గంటలు వరకు సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కూడా పాల్గొంటారు. సమావేశం అనంతరం విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళ్తారు.