ప్రణాళిక ప్రకారం గ్రుహనిర్మాలు జరగాలి
Ens Balu
4
Anakapalle
2022-04-24 13:29:13
సీఎం ప్రాధాన్యత కార్యక్రమమైన పేదలందరికీ ఇల్లు పథకం లో గృహ నిర్మాణాలను ప్రణాళిక ప్రకారం చేపట్టాలని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొన్నిచోట్ల ప్రశంసనీయమైన పని జరిగిందని, మరికొన్ని చోట్ల సమస్యలు వచ్చాయని తెలిసిందన్నారు. సమన్వయం లేక సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోందన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా కొన్నిచోట్ల పని మందకొడిగా సాగుతోంది అన్నారు. సమస్య ఎక్కడ ఉన్నదో కనుగొని పరిష్కరించి నట్లయితే పనులు వేగంగా పూర్తి అవుతాయన్నారు. అనకాపల్లి మండలం లో జరుగుతున్న పనుల పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేసి ప్రశంసించారు. ప్రజా ప్రతినిధుల సహకారంతో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. చిన్న చిన్న సమస్యలను మండల స్థాయి ప్రజాప్రతినిధులతో పరిష్కరించుకోవచ్చన్నారు. గృహ నిర్మాణాల తో సంబంధమున్న ఆయా శాఖల అధికారులు తరచు చర్చించుకోవాలన్నారు. తాసిల్దార్ స్థాయిలోనే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని లేనట్లయితే ఆర్డీవో దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ ఎటువంటి చిన్న పొరపాటుకు తావివ్వకుండా డాక్యుమెంటేషన్ చేసినట్లయితే ఎటువంటి సమస్యలు ఉండవన్నారు. వివిధ స్థాయిల్లో ఉన్న గృహ నిర్మాణాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేయాలన్నారు. మండల స్థాయిలో హౌసింగ్ అసిస్టెంట్లతో ప్రతిరోజు సమీక్షించాలని ఏ ఈ లను ఆదేశించారు. నిర్మాణాలు ఆగి పోవడం లేదా మందకొడిగా సాగడానికి గల కారణాలను విశ్లేషించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి నర్సీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారులు చిన్నికృష్ణ గోవిందరావు జిల్లా గృహనిర్మాణ అధికారి రఘురామ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు డిప్యూటీ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.