ప్రజా సేవలన్నీ సచివాలయంలోనే అందాలి...


Ens Balu
1
Bheemunipatnam
2020-09-17 21:15:48

గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అత్యుత్తమమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.  రాష్ట్ర ముఖ్య మంత్రి ఇచ్చిన పిలుపు మేరకు వారంలో రెండు దినములు గ్రామీణ ప్రాంతాల సందర్శనలో భాగంగా గురువారం ఆయన భీమునిపట్నం నియోజక వర్గంలోని పద్మనాభం, ఆనందపురం మండలాల్లోని గ్రామ సచివాలయాలు, వై.యస్.ఆర్. రైతు భరోసా కేంద్రాలు,  వై.యస్.ఆర్. హెల్త్ క్లినిక్ ల నిర్మాలను ఆయన సందర్శించి పరిశీలించారు.  గ్రామ సచివాలయ సిబ్బందితో ఆయన మాట్లాడుతూ సచివాలయాల్లో కావలసిన వసతులన్నీ ఉన్నాయా లేదా సిబ్బందిని అడిగి తెలుసుకొని, ఏమైనా అవసరం ఉన్నాయా, ఉంటే ఆ వివరాలను తెలియజేయాలని తెలిపారు.  సిబ్బంది అందరూ ప్రతీరోజు వస్తున్నారా లేదా అని కలెక్టర్ సచివాలయ సిబ్బందిని అడుగగా ప్రతీ రోజు వస్తున్నామని కలెక్టర్ కు వివరించారు.  అనంతరం సచివాలయంలోని రిజిష్టర్లను పరిశీలించి, ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు.  గ్రామంలో ఎన్ని వీధులు ఉన్నాయని, పారిశుద్ద్యం పనులు జరుగుతున్నాయా లేదా, ఏమైనా సమస్యలను గుర్తించారా అని పంచాయితీ కార్యదర్శిని ఆయన అడుగగా  గ్రామంలో 9 వీధులు ఉన్నాయని, తడి చెత్త, పొడి చెత్తలను వేరుచేస్తున్నట్లు పంచాయితీ కార్యదర్శి కలెక్టర్ కు వివరించారు.  అన్ని వీధులు, కాలువలను  శుభ్రపరచి బ్లీచింగ్ చల్లుతున్నట్లు కార్యదర్శి తెలిపారు.  ఉదయం 5 గంటలకు వచ్చి 15  దినములు అన్నింటిని గమనించి అక్కడి సమస్యలను ఎంపిడిఓకి తెలియజేయమని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు.  గ్రామ సచివాలయ సిబ్బంది అందరికీ పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని, ఎవరెవరు ఏమి చేయాలో చెప్పాలని ఎంపిడిఓను ఆదేశించారు.  మరోసారి సచివాలయాన్ని సందర్శించిన నాటికి అడిగిన ప్రతి ప్రశ్నలకు సచివాలయ సిబ్బంది సమాధానాలు చెప్పాలన్నారు.  అనంతరం అక్కడ నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనాన్ని సందర్శించి పరిశీలించి ఎన్ని దినాల్లో పూర్తి అవుతుందని అసిస్టెంట్ ఇంజనీర్ ను అడిగి తెలుసుకున్నారు.  అన్ని సేవలు గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి రావాలని ఆదేశించారు.  వాలంటీర్లుగా ఉన్న సిబ్బంది అందరూ మీ మీ విధులను పూర్తి స్థాయిలో అవగాహనతో ఉండాలన్నారు.  అనంతరం ఆనందపురం మండలం గిడిజాల గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని సందర్శించి సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు.      అనంతరం జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, వై.యస్.ఆర్.రైతు భరోసా కేంద్రాలు, వై.యస్.ఆర్ హెల్త్ క్లినిక్ లు  నూతన భవనాల నిర్మాణాలను వేగవంతం చేసి  ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ మూడింటికి స్వంత భవనాలను ఈ యేడాదిలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.  వచ్చే నెల అక్టోబరు 1వ తేది నుండి సి.సి.రోడ్లు, కాలువలు నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.  రహదారి సౌకర్యం లేని గిరిజన ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.  ఈ పర్యటనలో జిల్లా జాయింట్ కలెక్టర్-3 గోవిందరావు, తహసిల్థార్లు, ఎంపిడిఓలు, తదితరులు పాల్గొన్నారు.