నియోజకవర్గంలో ఒక్కోసారి స్పందన..


Ens Balu
3
Nidadavole
2022-04-25 08:55:40

పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా ఏర్పాటైన నూతన జిల్లాల యంత్రాంగం ప్రజలతో మమేకమైయ్యే దిశలో నియోజకవర్గ స్థాయి లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం నిడదవోలు మునిసిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో స్థానిక శాసన సభ్యులు జి.శ్రీనివాసనాయుడు, జాయింట్ కలెక్టర్ సిహెచ్.శ్రీధర్ లతో కలిసి  స్పందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి (సచివాలయం) వరకు స్పందన కార్యక్రమం ద్వారా ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతోందన్నారు. నూతన జిల్లాలు ఏర్పడడంతో జిల్లా యంత్రాంగం మరింత చేరువ కావడానికి తొలిసారిగా నిడదవోలు నియోజకవర్గ పరిధిలో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం మండల పరిధిలోనే అధికారులు అందుబాటులో ఉంటున్నా రన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఒక వారం జిల్లా కలెక్టరేట్ నందు, తదుపరి వారం నియోజకవర్గ పరిధిలో ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరించడం జరుగుతుందన్నారు.  ఫిర్యాదుల స్థాయిపై నిరంతర పర్యవేక్షణ వలన వెంటనే పరిష్కారం చూపడానికి క్షేత్ర స్థాయిలో స్పందన ద్వారా మంచి ఫలితాలు వస్తాయని మాధవీలత తెలిపారు. 

శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ కి వెళ్లి పరిష్కారం చూపాలని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ లు తీసుకుని వచ్చారన్నారు.  ప్రజా సమస్య  పరిష్కార వేదికగా ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో స్పందన ను ఏర్పాటు చేసి , ఆయా సమస్యల పరిష్కారం కోసం కాల పరిమితి నిబంధన అమలు చేస్తున్నట్లు తెలిపారు.  నూతన జిల్లా కలెక్టర్ గా వొచ్చిన డా. మాధవీలత ఒక అడుగు ముందుకు వేసి మన నియోజకవర్గం లో తొలి స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రజలు తరపున కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. స్పందన పిర్యాదు ల పరిష్కారాన్ని తదుపరి స్పందన లో తీసుకున్న చర్యలపై  సమీక్షించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఈ కార్యక్రమానికి జేసీ సిహెచ్. శ్రీధర్, ఆర్డీవో ఎస్. మల్లిబాబు, జిల్లా అధికారులు, మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయకుమారి, ఆర్డబ్ల్యూ ఎస్ ఇంజినీరింగ్ అధికారి డి.బాలశంకర రావు, డిప్యూటీ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ పీఎస్ విజయకుమార్, జెడి మత్స్యాశాఖ ఈ.కృష్ణారావు, డీఎస్ఓ పి.ప్రసాదరావు, డీసీఎస్ఎం కె.తులసి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి  ఎస్.మాధవరావు, జీఎం పరిశ్రమలు బి.వెంకటేశ్వరరావు,  నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండల అధికారులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.