పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని మండల అధికారులు విధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. స్పందనకు ప్రభుత్వం అత్యంత ప్రాదాన్యత ఇస్తుందని ఆయన పేర్కొంటూ సోమ వారం ఉదయం పూట మండల స్థాయి సమావేశాలు నిర్వహించారని ఆయన స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సోమవారం జరిగింది. 204 మంది వినతి పత్రాలు సమర్పించారు. తోటపల్లి ప్రాజెక్ట్ పునరావాసంలో భాగంగా కొత్తవలస గ్రీన్ఫీల్డ్ కాలనీలో నిర్వాసితులకు ఇల్లు కేటాయించారని, అదే స్థలాల్లో ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణం చేపట్టినందున ఇంటి స్థలాలు మంజూరు చేయాలని అడ్డాపు శీల మండలం బంటు వాని వలస గ్రామ సర్పంచ్ సిహెచ్.గణేష్ వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామ రాయుడు చెరువు లోని ఏ.33.61 సెంట్ల విస్తీర్ణం కలిగిన భూమి అన్యాక్రాంతానికి గురవుతున్నందున ప్రభుత్వ భూమి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా చెరువులో జాతీయ ఉపాధి హామీ పథకం పనులు జరగకుండా కొందరు అడ్డుకుంటున్నారని, విచారణ జరిపి ఉపాధి హామీ పనులు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని వీరఘట్టం మండలం వండువ గ్రామానికి చెందిన బాసూరు విశ్వేశ్వరరావు ఫిర్యాదును అందించారు. 2019 సంవత్సరంలో గ్రామ స్మశాన వాటిక కు చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణ పనులకు బిల్లులు మంజూరు చేయాలని గురుగుబిల్లి మండలం సన్యాసి రాజు పేట గ్రామానికి చెందిన జాగాన వెంకట నాయుడు కోరారు. తొంపాలపాడు చౌక ధరల దుకాణం నుండి నిత్యవసర సరుకులు తీసుకువచ్చేందుకు ప్రజలు నానావస్థలు పడుతున్నందున ప్రజల సౌకర్యార్థం జరడ గ్రామం వద్ద నిత్యావసర సరుకులు తీసుకునే విధంగా రేషన్ డిపో ఏర్పాటు చేయాలని కురుపాం మండలం బొడ్డమాను గ్రామానికి చెందిన బిడ్డికొలు సుదర్శన్ అర్జీ అందజేశారు.
గుమ్మలక్ష్మిపురం మండలం గోయిపాక పంచాయితి కుంటేసు గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనానికి నాడు నేడు క్రింద అభివృద్ధి చేశారని, అలాగే రెండో విడతలో మరి కొన్ని పాఠశాలల్లో అభివృద్ధి చేయాలని గోయిపాక గ్రామానికి చెందిన సామల కృష్ణ మూర్తి వినతి సమర్పించారు. గ్రామంలో నిర్మాణ పనులు పూర్తిచేసిన అంగన్వాడి కేంద్రం భవనానికి బిల్లులు మంజూరు చేయాలని గుమ్మ లక్ష్మీ పురం గ్రామానికి చెందిన కే.రాజేష్ కోరారు. దివ్యాంగురాలు అయిన తనకు ఎటువంటి ఆధారం లేనందున ఉపాధి అవకాశం కల్పించాలని మండలంలోని కవిటీ భద్ర గ్రామానికి చెందిన తుమరాడ దుర్గమ్మ అర్జీ అందజేశారు. కురుపాం మండలం నీలకంటాపురం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్ట్ లో వైద్యుని నియమించాలని అదే గ్రామానికి చెందిన ఏ.మన్మధరావు కోరారు. స్పందనకు వచ్చిన వినతులలో ఎక్కువగా రేషన్ కార్డు, సదరం దృవీకన పత్రాలు మంజూరు చేయాలని, భూసమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.