మలేరియా నివారణే ధ్యేయంగా పనిచేయాలి


Ens Balu
7
Parvathipuram
2022-04-25 09:27:34

మలేరియా నివారణే ధ్యేయం కావాలని, ఆ ధిశగా అధికారులు పనిచేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. మలేరియా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో మలేరియా అవగాహన వాల్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మలేరియా ప్రభలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పక్కా కార్యాచరణ ప్రణాళిక ఉండాలని, నిర్దేశిత సమయంలో స్ప్రేయింగ్ జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాని విధంగా పర్యవేక్షణ ఉండాలని ఆయన అన్నారు. ప్రతి ఇంటి పైనా దృష్టి కేంద్రీకరించాలని, క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులు, సిబ్బందితో సహా తహశీల్దార్, మండల అధికారులు, జిల్లా అధికారులు మలేరియా నివారణ చర్యలపై తనిఖీలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. మలేరియాపై ప్రజలలో మంచి అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వాగ్దేవి, జిల్లా మలేరియా అధికారి కె. పైడి రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.