ప్రభుత్వ ఆసుపత్రులు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవలందిస్తున్న గ్రేడ్ -3 ఎంపీహెచ్ఏలు, ఏఎన్ఎంలకు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేకంగా శాఖాపరమైన పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు తెలిపారు. ఈ మేరకు పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం తన కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేశారు. పరీక్ష ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరుగుతుందని సంబంధిత ఏర్పాట్లు పక్కాగా చేసుకోవాలని అన్ని విభాగాల అధికారులకు సూచించారు. గాజులరేగలోని ఐయాన్ డిజిటల్, సీతం కళాశాల కేంద్రాలుగా నిర్వహించే పరీక్షకు మొత్తం 584 మంది హాజరవుతున్నారని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని చెప్పారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. లైజన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అందరి అధికారులతో సమన్వయంగా వ్యవహరించి పరీక్ష ప్రశాంతంగా జరిగేలా చూసుకోవాలని చెప్పారు. పరీక్షకు హాజరయ్యేవారు ఎలాంటి పుస్తకాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని హెచ్చరించారు. అందరూ నిర్ణీత సమయంలోగా కేంద్రాలకు చేరుకోవాలని, నిబంధనలు పాటించాలని సూచించారు. సమావేశంలో ఏపీపీఎస్సీ ప్రతినిధి సత్యనారాయణ, డీప్యూటీ డీఎం & హెచ్‌వో డా. నారాయణరావు, ఐయాన్ డిజిటల్ ప్రతినిధి అవినాష్ బాబు, లైజెన్ అధికారులు, పోలీసు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.