ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి
Ens Balu
5
Parvathipuram
2022-04-26 10:11:37
పార్వతీపురం మన్యం జిల్లాలో వచ్చేనెల 6వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా, పగద్భందిగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై డీ అర్ ఓ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మే 6వ తేది నుంచి 23 వరకు, రెండో సంవ్సరం పరీక్షలు మే 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగనున్నట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం గం.9.00 నుంచి గం.12.00 వరకు జరుగుతాయని అన్నారు. జిల్లాలో మొదటి సంవత్సరం పరీక్షలకు 10349 మంది విద్యార్థులు, సెకెండ్ ఇయర్ పరీక్షలకు 10093 మంది కాగా మొత్తం 20442 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందుకు 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల పర్యవేక్షణకు 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 4 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఏర్పాటుచేసిన 14 పరీక్షా ప్రశ్నా పత్రాలు భద్రపరిచే కేంద్రాల నుంచి సంబంధిత పరీక్షా కేంద్రాల వద్దకు తరలించేందుకు పటిష్ట బందోబస్తు కల్పించాలని పోలీస్ అధికారులను సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద త్రాగు నీరు, ఓ అర్ ఎస్ ప్యాకెట్లను సరఫరా చేయాలని, అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్య కార్యకర్తలకు నియమించాలని ఆదేశించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో చేరుకొనేవిధంగా ఉ.గం.6.00 నుంచి గం.8.00ల మధ్య కొమరాడ, కురుపాం మండలం కేంద్రం నుంచి బస్సు సర్వీసులు నడపాలని అర్ టి సి సహాయ మేనేజర్ గంగ రాజును సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించి ప్రతిఒక్కరూ మాస్క్ ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియెట్ బోర్డ్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎమ్.ఆదినారాయణ, డి వి ఈ ఓ ఎస్.బి.శంకర రావు, డి ఈ ఓ కె.గంగా భవాని, పోస్టల్ సహాయ పర్యవేక్షకులు పి.ఎస్.కుమార్, తదితరులు పాల్గొన్నారు.