ఆసుపత్రులు త్వరితగతిన ప్రారంభించాలి
Ens Balu
5
Kakinada
2022-04-26 12:12:19
ప్రభుత్వ ఆసుపత్రులలో నాడు-నేడు కింద చేపట్టిన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో నాడు-నేడు కింద చేపట్టిన ఆసుపత్రుల నూతన నిర్మాణ పనులు, మరమ్మతులు, ఆధునికీకరణ పనుల పురోగతి తదితర అంశాలపై కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా.. జిల్లా వైద్య ఆరోగ్య, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, రంగరాయ వైద్య కళాశాల అధికారులు, పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ, ఏపీ ఎంఎస్ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షీంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు రూ. 45 కోట్లతో ఏలేశ్వరం, ప్రత్తిపాడు సీహెచ్‌సీలలో 30 నుంచి 50 పడకలు ఏర్పాటు చేయడంతో పాటు ఇతర సీహెచ్‌సీలలో భారతీయ ప్రజారోగ్య ప్రమాణాల ప్రకారం ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రితో పాటు తుని ఏరియా ఆసుపత్రి, ప్రత్తిపాడు, జగ్గంపేట, రౌతులపూడి, ఏలేశ్వరం, తాళ్లరేవు తదితర సీహెచ్సీలలో చేపట్టిన నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులు పనులలో పురోగతి చూపి నిర్దేశ గడువులోపు లక్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య అధికారిణి డా. బి.మీనాక్షి, జీజీహెచ్ సుపరింటెండెండ్ డా. పి.వెంకటబుద్ధ, ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డా. డి.ఎస్.వి.ఎల్.నరసింహ, డీసీహెచ్ఎస్ డా. పీవీ.విష్ణువర్థిని, ఏపీఎంఎస్ఐడీసి ఈఈ కె.సీతారామరాజు, పంచాయతీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాసు, అర్ అండ్ బి ఎస్ఈ హరిప్రసాద్‌బాబు ఇతర అధికారులు హాజరయ్యారు.