జిల్లాలో ఫీవర్ సర్వే సక్రమంగా చేపట్టాలి


Ens Balu
2
Paderu
2022-04-26 12:53:15

ఫీవర్ సర్వే సక్రమంగా చేసి వేగంగా పూర్తి చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఉదయం ఆయన క్యాంప్ కార్యాలయం నుండి జిల్లాలోని ఎంపీడీఓలు,వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, డివిజనల్ పంచాయతీ అధికారులతో  టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు,గ్రామ వాలంటర్లు సమన్వయంతో  పనిచేసి పగడ్బందీగా ఫీవర్  సర్వే చేయాలని ఆదేశించారు. ఎంపిడిఓ లు క్షేత్ర స్థాయి సిబ్బందికి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు. ఎం పి డి ఓ లు ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి మనబడి నాడు నేడు రెండవ విడత పనులకు సాంకేతిక పరమైన అనుమతులు పొందాలని సూచించారు. బ్యాంక్ ఖాతాలు తెరవాలని స్పష్టం చేసారు. ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన పనిదినాలు కల్పించాలని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాల క్రిష్ణ మాట్లాడుతూ 212 గ్రామ సచివాలయం భవనాలు,209 రైతు భరోసా కేంద్రాలు,112 వెల్నెస్ సెంటర్లు నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు.84 రైతు భరోసా కేంద్రాలు 90శాతం నిర్మాణాలు పూర్తయ్యాయని అన్నారు. ప్రతీ వారం అధికారులతో నిర్మాణాలు, ఉపాధి పనులు పురోగతి పై సమీక్ష చేస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎహెచ్ ఓ డా.రామ్మోహన్, ఎంపిడిఓ లు,వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.