ప్రస్తుత రబీ సీజనులో జిల్లాలోని రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు 167 రైతుభరోసా కేంద్రాల ద్వారా సేకరణకు ఏర్పాట్లు చేశామని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ వెల్లడించారు. మే 1వ తేదీ నుంచి ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలోని రైతులంతా రబీ సీజనులో తాము పండించిన ధాన్యాన్ని రైతుభరోసా కేంద్రాల్లో విక్రయించి మద్ధతు ధర పొందాలని కోరారు. ఈ కొనుగోలు కేంద్రాలను 78 ధాన్యం సహాయక సంఘాలకు అనుసంధానం చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రస్తుత రబీలో 8,986 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వుంటుందని అంచనా వేస్తున్నామని, ఇందులో 6,290 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనగోలుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆధ్వర్యంలో గురువారం ఆనందగజపతి ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ధాన్యం తెచ్చేందుకు అవసరమైన గోనె సంచులను పౌరసరఫరాల సంస్థ సమకూరుస్తుందని పేర్కొన్నారు. ధాన్యం రవాణాకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని, రైతులు తమ సొంత ఖర్చులతో ధాన్యం రవాణాచేస్తే రవాణా ఖర్చులు కూడా చెల్లిస్తామన్నారు. రైతులు ఎవరైనా ఇప్పటివరకూ ఇ-క్రాప్ చేయించుకోనట్లయితే వెంటనే రైతుభరోసా కేంద్రాలకు వెళ్లి చేయించుకోవాలన్నారు. ఇప్పటికే ధాన్యం విక్రయించేందుకు సిద్ధంగా వున్న రైతులు రైతుభరోసా కేంద్రాల్లో షెడ్యూలింగు చేసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి బి.టి.రామారావు, జిల్లా సహకార అధికారి ఎస్.అప్పలనాయుడు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మీనా, పౌరసరఫరాల అధికారి పాపారావు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి శ్యాం తదితరులు వ్యవసాయ సహాయకులు, సహకార సంఘాల సిబ్బంది తదితరులకు కొనుగోలు ప్రక్రియపై అవగాహన కలిగించారు.