అనధికారికంగా మందులు నిల్వచేస్తే జైలే


Ens Balu
5
Srikakulam
2022-04-28 14:49:04

శ్రీకాకుళం జిల్లాలో అనధికార మందుల నిల్వ చేసేవారికి  జైలు శిక్ష తప్పదని జిల్లా ఔషద నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు యం.చంద్రరావు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన జారీచేసారు. ఔషధ చట్టం, 1940  నిబంధనలు అతిక్రమించినందుకు బగాది కూర్మినాయకులు అనే ముద్దాయికి ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు ముప్పై వేల రూపాయల జరిమానాను టెక్కలి అసిస్టెంట్ సెషన్స్ కోర్టు విధించిందని స్పష్టం చేసారు. 2018 సం.లో లైసెన్సులు లేకుండా మందులు నిల్వ ఉంచి అమ్ముతున్నారని సమాచారం మేరకు అప్పటి పాలకొండ, శ్రీకాకుళం, టెక్కలి డ్రగ్స్ ఇన్ స్పెక్టర్లు కూన కళ్యాణి, ఎ.కృష్ణ, ఎ.లావణ్య ఆకస్మికంగా తనిఖీ చేసి సదరు బగాది కూర్మినాయుకులు నిల్వ ఉంచిన మందులను స్వాధీన పరచుకొని టెక్కలి కోర్టులో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. కోర్టులో నేరం నిరూపణ అయినందున సదరు ముద్దాయికి రూ.30వేల జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష వేసినట్లు చెప్పారు. ఔషధ చట్ట ప్రకారం లైసెన్సులు లేకుండా మందులు విక్రయాలు ఎవరైనా జరిపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని సహాయ సంచాలకులు  యం.చంద్రరావు ఆ ప్రకటనలో హెచ్చరించారు.