పరీక్ష కేంద్రాన్ని తనిఖీచేసిన కలెక్టర్..


Ens Balu
5
Parvathipuram
2022-04-29 08:09:58

పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండల కేంద్రంలో సెయింట్ జేవియర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. విద్యార్థుల హాజరు విధానాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ నాగమణి,  డిపార్ట్ మెంటల్ అధికారి యు.అప్పారావును పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించుటకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరీక్షలు పూర్తయ్యేవరకూ ఎక్కడ ఎటువంటి లోపాలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. మాస్ కాపీయింగ్, పరీక్ష పత్రాలు లీక్ వంటి ఉదంతాలు సంభవించకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అనవసరపు వదంతులు వ్యాప్తి కాకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, పరీక్ష జరుగుతున్నంత కాలం విద్యుత్ సరఫరా జరిగే విధంగా సంబంధిత అధికారులతో సమన్వయం చేయాలని ఆయన చెప్పారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయుటకు అనుగుణంగా పరీక్ష కేంద్రం ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభాకర్ రావు, తాహశీల్దార్ బుచ్చయ్య, ఆర్. ఐ  ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం 10,631 మందికి గాను 10,581 మంది విద్యార్థులు పరీక్షలు హాజరయ్యారు.